Begin typing your search above and press return to search.

వందో ఒక వెయ్యో లక్షో కాదయా.. వంద కోట్లయా.. డౌటయా?

ఎప్పటిలానే ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీను లెక్కించే ఆ దేవస్థానం అధికారులు అదే పనిలో ఉన్నారు

By:  Tupaki Desk   |   24 Aug 2023 12:13 PM GMT
వందో ఒక వెయ్యో లక్షో కాదయా.. వంద కోట్లయా.. డౌటయా?
X

వందా, వెయ్యి, లక్షా, పది లక్షలు, వంద లక్షలు (కోటి), పది కోట్లూ కాదు... ఏకంగా వంద కోట్ల చెక్‌ ను విశాఖ సింహాద్రి అప్పన్న హుండీలో వేశాడు ఒక భక్తుడు! అదేదో బంగారం రూపంలోనో, వజ్రాల రూపంలోనో ఇవ్వొచ్చు కదా అని కొంతమంది ఆలోచించారు కూడా. కానీ.. ఆ భక్తుడు అని చెప్పబడే వ్యక్తి 100 కోట్ల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చాడు!

ఎప్పటిలానే ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీను లెక్కించే ఆ దేవస్థానం అధికారులు అదే పనిలో ఉన్నారు. ఈ సమయంలో కంటికి కనిపించిన ఒక చెక్కు... వారిని ఆనందంతో కూడిన, ఆశ్చర్యంతో కలగలిపిన షాక్ కు గురి చేసింది. కారణం... ఆ చెక్కుపై 100 కోట్ల రూపాయలకు రాసి సంతకం చేసి ఉంది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్ల చెక్ కళ్లముందు సాక్షాత్కారం అయ్యింది. దీంతో అధికారులు ఆనందం, ఆశ్చర్యం కలిగిన ఎక్స్ ప్రెషన్స్ తో కనిపించారట. అనంతరం తేరుకున్న అధికారులు ఇప్పటివరకు వందల సంవత్సరాల దేవస్థాన చరిత్రలో ఎన్నడూ జరగని వింత ఇదని చెప్పరంట.

ఇదే సమయంలో ఆ భక్తుడు ఎవరో తెలుసుకుని స్వయంగా కలిసి ఆహ్వానించి, అధికారికంగా దేవాలయ మర్యాదలతో దర్శనాన్ని కూడా చేయించాలని ప్రణాళికలు వేయడం ప్రారంభించారట.

అవును... ఎప్పటిలాగానే సింహాచలం వరాహాలక్ష్మి నర్సింహ్మ స్వామి హుండీ ప్రతీ 15 రోజులకు ఒకసారి లెక్కింపు జరుగుతూ ఉందట. ఈ క్రమంలో 100 కోట్ల భారీ విరాళం చెక్కు దర్శనమిచ్చిందట. దీంతో షాక్ కు గురయిన అధికారులు ఆ తర్వాత కాసేపటికి తేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారట.

దీంతో ఆ చెక్ వివరాలను బట్టి బొడ్డేపల్లి రాధాకృష్ణ కు చెందిన సేవింగ్స్ అకౌంట్ గా గుర్తించారు. విశాఖపట్నం ఎంవీపీ డబుల్ రోడ్డు బ్రాంచ్ పేరుతో చెక్ నెంబర్ ఉందని చెబుతున్నారు. అయితే... సేవింగ్స్ అకౌంట్ నుంచి 100 కోట్ల విరాళం ఇవ్వడం పై టెంపుల్ అధికారులకు అనుమానం వచ్చింది.

దీంతో బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయించారు కొందరు మీడియా ప్రతినిధులు. ఇక్కడ భారీ షాక్ తగిలింది. ఆ అకౌంట్ లో కేవలం 17 అంటే అక్షరాలా పదిహేడు రూపాయలు మాత్రమే ఉన్నాయి. తో ఇది ఆకతాయి పనా, లేక మతిస్థిమితం కోల్పోయి చేసిన పనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారట. అయితే మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి ఖతాలో 17వేలు ఉంటాయా అన్నది మరో డౌట్.

ఈ సమయంలో చెక్ హోల్డర్ వివరాలను అధికారికంగా కనుక్కునెందుకు చెక్ ను బ్యాంక్ కు అధికారికంగా పంపి పూర్తి వివరాలు తీసుకోవాలని నిర్ణయించారు టెంపుల్ అధికారులు. మరి ఆ వ్యక్తి వివరాలు బయటకు వెల్లడిస్తరా.. లేక, పొరపాటుగా భావించి వదిలేస్తరా అన్నది వేచి చూడాలి.