Begin typing your search above and press return to search.

నిన్న తిరుమల నేడు సింహాచలం...ఎందుకిలా ?

సింహాచలం చందనోత్సవానికి లక్షల మంది భక్తులు వస్తారని అంచనాలు వేసుకున్నారు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు.

By:  Tupaki Desk   |   30 April 2025 10:30 AM
Simhachalam Tragedy Wall Collapse
X

దేవుడు ఒకడే అని అంటారు. కానీ హిందువులు నమ్మేది దేవుడిలో అనేక రూపాలను. అందుకే అడుగడుగున గుడి ఉంటుంది. అందరిలో గుడి ఉంటుంది అన్నది ఆస్తికులు గాఢంగా నమ్మే విషయాలు. దేవుడి దర్శనం చేసుకోవాలని విశిష్టమైన పండుగల వేళ ఆ దర్శన భాగ్యంతో మరింతగా జీవితాలలో కొత్త వెలుగులు చూడాలని ఆశపడే వారు అంతా ఆలయాలకు వస్తూంటారు.

అలా వచ్చే భక్తులకు అక్కడ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారా అన్నదే అతి పెద్ద ప్రశ్నగా ఉంటోంది. తగిన విధంగా సదుపాయాలను కల్పించకపోవడం నేరమే కాదు మహా ఘోరం. అందుకే వరసగా ఆధ్యాత్మిక కేంద్రాలలో భక్తుల ఆర్తనాదాలు దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నాయి.

భక్తితో దేవుడి ఆలయానికి రావడమే చేసిన పాపమా అని భక్తులు అనుకునే పరిస్థితి వస్తోంది. ప్రతీ ఏటా ఉత్సవాలను నిర్వహించే అధికారులు ప్రభుత్వ పెద్దలకు ఎలా భక్తులను కట్టడి చేయాలి ఎలా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలి అన్నది బాగా తెలిసి ఉండాలి.

సింహాచలం చందనోత్సవానికి లక్షల మంది భక్తులు వస్తారని అంచనాలు వేసుకున్నారు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. అయితే తాళం వేసితిమి గొళ్ళెం మరచితిమి అన్నట్లుగా ఆ ఏర్పాట్ల సంగతి అటుంచితే కొత్తగా నిర్మించిన గోడ మృత్యు రూపంలో ప్రాణాలు తీసింది. ఇంతకీ ఈ గోడ ఎపుడు కట్టారు అంటే కొద్ది రోజుల క్రితమే అని అంటున్నారు.

మరి అంత తొందరగా ఎందుకు కట్టారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఇక చూస్తే సింహాచలం అప్పన్న స్వామి వారి చందనోత్సవం కోసం రెండు నెలల ముందు నుంచే సమీక్షలు నిర్వహించారు. ప్రతీ విషయం మీద క్షుణ్ణంగా చర్చించారు. మరి ఆ సమయంలోనే గోడని నిర్మించాలని ప్రతిపాదనలు వస్తే అపుడే నిర్మించి ఉంటే ఇప్పటికి దాని నాణ్యత ఏమిటో తెలిసి ఉండేది కదా అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఆలయాలలో కార్యక్రమాలు కానీ నిర్వహణ కానీ ఒంటి చేతులో మీద జరగడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. అధికారులతో పాటు రాజకీయ శక్తులు కూడా ప్రవేశిస్తున్నాయి. అస్మదీయులు తస్మదీయులుగా ప్రతీ పనిలో విడిపోయి వ్యవహారాన్ని సాఫీగా కాకుండా జఠిలం చేస్తున్నారు.

దాని వల్లనే అనేక ఉప్రద్రవాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఇక చందనోత్సవం కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశామని చెబుతున్న వారు అక్కడ అంతా చీకటిగా ఉందని దానికి వెలుగులు అందించాలన్న ఆలోచన ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. అదే విధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నపుడు కొత్తగా నిర్మించిన వాటి విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అన్న ఆలోచనలు చేయలేకపోయారా అన్నది కూడా అంతా అడుగుతున్న పరిస్థితి ఉంది.

మొత్తానికి చూస్తే దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అన్నట్లుగా అందరూ కలసి తలో విధంగా ఆలోచనలు చేయడం వల్లనే అసలైన భక్తులకు ప్రాణ సంకటంగా మారుతోంది అని అంటున్నారు. విశిష్టమైన చందనోత్సవం పెట్టుకుని ఆదరాబాదరాగా గోడ నిర్మాణం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది కూడా అడుగుతున్నారు. ఒకవేళ నిర్మించినా నాణ్యతను సక్రమంగా చూసుకోవాలి కదా అని అంటున్నారు.

ఏది ఏమైనా ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోంది. దేవ దేవుని దర్శనం కోసం పోతే ప్రాణాలు హరీ మంటున్నాయి. దానికి ఉదాహరణ నిన్న తిరుపతిలో తొక్కిసలాట. నేడు సింహాచలంలో చందనోత్సవం వేళ మృత్యు లీల. ఈ మొత్తం పరిణామాలను చూస్తే కనుక ఆలయ అధికారులు ఒకటికి రెండు సార్లు ప్రతీ విషయాన్ని సమీక్షించుకుని కానీ ఉత్సవాలకు సిద్ధపడకూడదు అనిపిస్తోంది.

లేకపోతే భక్తుల ప్రాణాలే పోతూ ఉంటాయి. సంఘటనలు జరిగినపుడు వాటి నుంచి గుణపాఠాలు నేర్వకపోతే ఇలాగే ఉంటుందని ఆస్తిక జనులు అంటున్నారు. మరికొందరు ముందుకెళ్ళి దేవాదాయ శాఖను ప్రభుత్వం పరిధి నుంచి ఆధ్యాత్మిక సంస్థలకు పీఠాలకు మఠాలకు అప్పగిచాలని డిమాండ్ చేస్తున్నారు.