అప్పన్న చందనోత్సవం...వారే వీఐపీలు
ఉత్తరాంధ్రలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
By: Satya P | 19 April 2026 7:00 AM ISTఉత్తరాంధ్రలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 19వ తేదీ ఆదివారం అర్ధరాత్రి నుంచి చందనోత్సవ వేడుకలు మొదలవుతాయి. అద్భుతంగా జరిగే ఈ అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈసారి అత్యంత పకడ్బందీగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా భక్తులందరూ స్వామి నిజ రూప దర్శనం చేసుకునే విధంగా తగిన చర్యలు చేపట్టారు.
సామాన్యులకే పెద్ద పీట :
ఇదిలా ఉంటే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక చందనోత్సవం రోజు అయిన 20వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు తొలి పూజ అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయిన్నారు. అదే రోజు సాయంత్రం ఆరు గంటల కల్లా దర్శనాల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు అధికారులు సిద్ధం చేశారు.
లక్షన్నర ఉచిత దర్శనాలు :
మొత్తం రెండు లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా 300, 1000 1500 రూపాయల కేటగిరీలలో సుమారు 40 వేల టికెట్లను విక్రయించడం జరిగింది. దాంతో మిగిలిన లక్షన్నర మంది భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నామని అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా అప్పన్న కొండ పైకి భక్తులను తరలించడానికి వంద దాకా ప్రత్యేక బస్సులను ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈసారి ప్రత్యేకత ఏమిటి అంటే భక్తుల సౌకర్యం కోసం క్యూ లైన్ల దూరాన్ని తగ్గించారు. ఎండ, వానల నుండి రక్షణ కోసం క్యూ లైన్ల పొడవునా పూర్తి స్థాయిలో నీడనిచ్చే విధంగా షెల్టర్లు ఏర్పాటు చేశారు. తిరుమల, విజయవాడ దేవస్థానాల నుండి వచ్చిన అనుభవజ్ఞులైన సిబ్బందితో క్యూ లైన్లను వేగంగా కదలడానికి చర్యలు అధికారులు చేపట్టారు.
ప్రోటోకాల్ కొద్ది మందికే :
ఇదిలా ఉంటే ఈసారి ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన అతి కొద్ది మందికి అంటే సుమారుగా 500 మందికి మాత్రమే ఉదయం అయిదు గంటల లోపు అంతరాలయ దర్శనానికి అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల సగటు భక్తులు ఆందోళన చెందాల్సింది లేదని మొత్తం దర్శనాలు అన్నీ కూడా సాధారణ దర్శనాలుగానే కొనసాగుతాయని భరోసా ఇస్తున్నారు.
