Begin typing your search above and press return to search.

కేజీ వెండి రూ.లక్ష.. అందులో నిజమెంత?

బంగారం.. వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ రెండు ఆభరణాల్లో పెట్టుబడి సేఫ్ గా పలువురు అభివర్ణిస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 May 2024 4:28 AM GMT
కేజీ వెండి రూ.లక్ష.. అందులో నిజమెంత?
X

బంగారం.. వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ రెండు ఆభరణాల్లో పెట్టుబడి సేఫ్ గా పలువురు అభివర్ణిస్తున్నారు. కొద్ది రోజలుుగా బంగారం అంతకంతకూ పెరుగుతున్న వైనం తెలిసిందే. బంగారంతో పాటు వెండి ధర సైతం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా వెండి మీద సరికొత్త అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కేజీ వెండి ధర రూ.లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నారు. బంగారాన్ని పెట్టుబడి రూపంలో చూస్తున్న వారికి లాభాలు భారీగానే ఉంటున్నాయి. ఇప్పుడు వెండి కూడా అదే బాటలో నడుస్తోందని చెబుతున్నారు.

వెండి ధర ఆకర్షణీయంగా పెరిగే వీలుందని.. త్వరలోనే ఇది కేజీ వెండి రూ.లక్ష వరకు వెళుతుందన్న అంచనాల్ని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన నివేదికలో పేర్కొంది. ఎవరైనా వెండి మీద పెట్టుబడులు పెట్టాలని భావిస్తే.. ఇదే సరైన టైంగా పేర్కొంటున్నారు. వెండి ధర తగ్గిన ప్రతిసారీ కొనుగోలు చేయాలని.. భవిష్యత్తులో మంచి ధర పలకటం ఖాయమంటున్నారు.

ఇంతకూ వెండి ధర పెరగటానికి దోహదపడే అంశాలేమిటి? అన్న విషయంలోకి వెళితే.. కీలక అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. వెండి ధర మొత్తం దాని ఉత్పత్తి.. పారిశ్రామిక డిమాండ్ ఆధారంగా దాని ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయంటున్నారు. వెండిని ఉత్పత్తి చేసే దేశాల్లో మెక్సికో.. దక్షిణ అమెరికా దేశాలైన పెరు.. చిలీ.. బొలీవియా.. అర్జెంటీనాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వెండిలో ఈ దేశాల వాటానే 50 శాతం.

ఈ దేశాల్లోని రాజకీయ పరిణామాల వల్ల గడిచిన పదేళ్లలో వెండి ఉత్పత్తి పెరిగింది లేదు. దీంతో వెండి సరఫరా అధికంగా లేకపోవటం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు. ఇక.. వెండిని ఆభరణాల కోసం వినియోగించేది 20 శాతమైతే.. 80 శాతం పారిశ్రామిక అవసరాల కోసం వాడటం గమనార్హం. పారిశ్రామిక వినియోగం పెరిగే కొద్దీ వెండి ధర పెరుగుతుంది. వెండి సరఫరా స్థిరంగా ఉండటం.. మరోవైపు పారిశ్రామిక అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి ధర పెరగటం ఖాయమంటున్నారు.

పారిశ్రామిక రంగాల్లో ముఖ్యంగా విద్యుత్ వాహనాలు.. బ్యాటరీలు.. విద్యుత్తు నిల్వ ఉత్పత్తుల్లో వెండిని వినియోగిస్తారు. ఇటీవల కాలంలో ఈ ఉత్పత్తుల డిమాండ్ పెరగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెండి.. రాగి.. నికెల్.. అల్యూమినియం లోహాలకు డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు. మొత్తంగా వెండి మీద పెట్టుబడి పెట్టాలని భావించే వారెవరైనా సరే.. తక్కువ ధరలో ఉన్నంతనే కొనుగోలు చేయటం ద్వారా లాభాలు పొందే వీలుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. చివరగా.. ఈ అంచనాలన్నీ నిపుణులు చెబుతున్న అంశాల ఆధారంగానే చెబుతున్నదే తప్పించి.. ఇందులో పెట్టుబడులు పెట్టమన్న సిఫార్సు ఈ కథనం ద్వారా చేయటం లేదన్న విషయాన్ని మర్చిపోవద్దు.