ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు: సిగాచి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జూన్ 30న సంభవించిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది.
By: Tupaki Desk | 2 July 2025 4:30 PM ISTసంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జూన్ 30న సంభవించిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 40కి చేరినట్లు సిగాచి కంపెనీ స్వయంగా ప్రకటించింది. మరో 33 మందికి గాయాలైనట్లు వెల్లడించింది. ఈ దుర్ఘటనతో పారిశ్రామిక భద్రతా ప్రమాణాలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
- కంపెనీ కీలక ప్రకటన:
సిగాచి కంపెనీ ఈ ఘటనపై స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది. తమ కార్యకలాపాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ తెలిపారు. గాయపడిన వారికి పూర్తి వైద్య సేవలు అందిస్తామని, అన్ని బీమా క్లెయిమ్‌లను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని, ప్రభుత్వ దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నామని కంపెనీ పేర్కొంది.
-FIRలో సంచలన విషయాలు:
ఈ ప్రమాదంపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. ఫ్యాక్టరీలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించలేదని పోలీసులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరేందుకు సరైన మార్గాలు లేకపోవడం సహాయ చర్యలకు ఆటంకం కలిగించిందని తెలిపారు. ఫ్యాక్టరీలో వాడుతున్న మెషినరీ పాతదిగా, కాలానుగుణంగా ఆధునీకరించకపోవడమే ప్రమాదానికి దారితీసిందని ఎఫ్‌ఐఆర్ వివరించింది. ఉద్యోగులు ఈ ప్రమాద భయాన్ని యాజమాన్య దృష్టికి తీసుకెళ్లినా, వారు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం.
-ప్రభుత్వ స్పందన - విచారణకు ఆదేశాలు:
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాకుండా, ప్రమాదంపై అత్యున్నత కమిటీతో విచారణ జరిపిస్తామని, నిపుణులతో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, మృతులు, గాయపడిన వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పారిశ్రామిక భద్రతా ప్రమాణాలపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
లెక్కల్లో గందరగోళం.. అయోమయంలో కుటుంబాలు:
సిగాచి పరిశ్రమ, అధికారుల మధ్య మృతుల సంఖ్య, ఇతర వివరాలపై గందరగోళం నెలకొంది. కంపెనీ 162 మంది కార్మికులు డ్యూటీలో ఉన్నారని చెప్పగా, అధికారులు 143 మందే ఉన్నారని పేర్కొన్నారు. మృతుల సంఖ్యపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీ 40 మంది మృతిచెందారని ప్రకటించగా, కొన్ని నివేదికలు మృతుల సంఖ్య 46కు, మరికొన్ని 51కు చేరిందని సూచిస్తున్నాయి. ఈ లెక్కల్లో తేడాతో బాధిత కుటుంబాల్లో అయోమయం నెలకొంది. పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి మార్చురీకి పెద్ద సంఖ్యలో మృతదేహాలు రావడంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
-పారిశ్రామిక భద్రతపై ప్రశ్నార్థకం
ఈ ఘటన తెలంగాణలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల పర్యవేక్షణపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిబంధనలు పాటించకుండా, ప్రాణాలను లెక్క చేయకుండా వ్యాపార లాభాల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కంపెనీలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ, పరిశ్రమ శాఖలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిగాచి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.
