బొమ్మలా తిరుగుతూ నదిలో పడిన హెలికాఫ్టర్.. కార్పొరేట్ ఫ్యామిలీ దుర్మరణం
ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో దిగ్గజ సీమెన్స్ సంస్థకు చెందిన టాప్ ఉద్యోగి ఒకరు.. ఆయన కుటుంబ సభ్యులు దుర్మరణం పాలయ్యారు.
By: Tupaki Desk | 11 April 2025 9:53 AM ISTఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో దిగ్గజ సీమెన్స్ సంస్థకు చెందిన టాప్ ఉద్యోగి ఒకరు.. ఆయన కుటుంబ సభ్యులు దుర్మరణం పాలయ్యారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. న్యూయార్క్ లో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం షాకిచ్చేలా మారింది. ఒక టూరిస్టు హెలికాఫ్టర్ లో ప్రయాణించే వేళ.. సీమెన్స్ కు చెందిన స్పెయిన్ విభాగ అధిపతి.. సీఈవో ఫ్యామిలీ ఇందులో ప్రయాణిస్తున్నారు.
ఆటవిడుపుగా తన కుటుంబ సభ్యులతో కలిసి సీఈవో అగ ఎస్కోబార్ న్యూయార్క్ కు వచ్చారు. తమ ప్రయాణం కోసం ఒక టూరిస్టు హెలికాఫ్టర్ ను అద్దెకు తీసుకున్నారు. ఈ హెలికాఫ్టర్ హడ్సన్ నది మీదుగా వెళుతున్న వేళలో ప్రమాదం చోటు చేసుకుంది. పట్టు కోల్పోయిన హెలికాఫ్టర్ గింగిరాలు తిరుగుతూ ఆట బొమ్మలా వేగంగా నదిలోకి దూసుకెళ్లింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ లో ఉన్న ఆరుగురు దుర్మరణం చెందారు.
మరణించిన వారిలో ఎస్కోబార్.. ఆయన సతీమణి.. ముగ్గురు పిల్లలతో పాటు పైలెట్ సైతం ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన బెల్ 206 చాపర్ ను న్యూయార్క్ హెలికాఫ్టర్ టూరిజం విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. గాల్లో ఉండగానే హెలికాఫ్టర్ లోని ఒక భాగం విరిగిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోను చూసిన వారు షాక్ కు గురవుతున్నారు.
