సీఎం రాజీనామా? కర్ణాటక రాజకీయాల్లో కలకలం..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ముఖ్యమంత్రి మార్పుపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది.
By: A.N.Kumar | 26 May 2026 11:56 PM ISTకర్ణాటక రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలోనే తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా గురువారం మే 28న సిద్ధరామయ్య సీఎం పీఠాన్ని వదులుకోనున్నారని.. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోందని జాతీయ మీడియా సంస్థ 'ఇండియా టుడే' ఒక కథనంలో పేర్కొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన సిద్ధరామయ్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో బలమైన ఓటు బ్యాంక్, అపారమైన రాజకీయ అనుభవం ఉన్న సిద్ధరామయ్య సేవలను ఢిల్లీలో ఉపయోగించుకోవాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోంది.
ఇందులో భాగంగానే ఆయనను సీఎం పదవి నుంచి తప్పించి రాజ్యసభకు పంపే వ్యూహంలో కాంగ్రెస్ ఉంది. రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధరామయ్యకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.
తెరపైకి ‘పవర్ షేరింగ్’ ఒప్పందం.. రేసులో డీకే శివకుమార్!
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ముఖ్యమంత్రి మార్పుపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మధ్య ‘పవర్ షేరింగ్’ అధికార మార్పిడి ఒప్పందం కుదిరిందని, రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్‌కు సీఎం పదవి అప్పగిస్తారనే ప్రచారం అప్పట్లోనే బలంగా సాగింది.
ఇప్పుడు సిద్ధరామయ్య రాజీనామా వార్తలతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాలు మరింత స్పష్టమవుతున్నాయి. రాష్ట్రంలో ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న డీకేకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాబోయే కాలంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని హైకమాండ్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముడా వివాదమే కారణమా?
సిద్ధరామయ్య రాజీనామా ఊహాగానాల వెనుక కేవలం జాతీయ రాజకీయాలే కాకుండా ఇటీవల ఆయన చుట్టూ ముసిరిన వివాదాలు కూడా ఒక కారణమనే చర్చ నడుస్తోంది. ముడా (మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) భూకుంభకోణం ఉదంతం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని తీవ్ర రక్షణలో పడేసింది. ఈ వివాదం రోజురోజుకూ ముదరడం.. ప్రతిపక్ష బీజేపీ దీనిని తీవ్రంగా అందిపుచ్చుకోవడంతో అధిష్టానం నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఈ నాయకత్వ మార్పు నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఉత్కంఠ రేపుతున్న రాబోయే 48 గంటలు
సిద్ధరామయ్య రాజీనామా అంశంపై ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం గానీ, కర్ణాటక పీసీసీ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ రాబోయే రెండు రోజులు కర్ణాటకతో పాటు దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి. సిద్ధరామయ్య నిజంగానే రాజీనామా చేసి ఢిల్లీ బాట పడతారా? లేక ఈ వార్తలను ఖండించి సీఎం కుర్చీలోనే కొనసాగుతారా? అనేది తెలియాలంటే గురువారం వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ నాయకత్వ మార్పు ఖాయమైతే కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైనట్లే!
