ఆ రాష్ట్రంలో మళ్లీ కుల గణన...తన ప్రభుత్వ నిర్ణయాన్నే రద్దుచేసిన సీఎం
అదే కులగణన.. కొన్నాళ్ల కిందట కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశాన్ని ఆ పార్టీ వివిధ రాష్టా‍్రల్లో ప్రధాన హామీగానూ ఇస్తోంది.
By: Tupaki Desk | 13 Sept 2025 3:00 AM ISTఒక అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయంగా ఉంది. అదే కులగణన.. కొన్నాళ్ల కిందట కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశాన్ని ఆ పార్టీ వివిధ రాష్టా‍్రల్లో ప్రధాన హామీగానూ ఇస్తోంది. అంతేగాక.. 22 నెలల కిందట అధికారంలోకి వచ్చిన తెలంగాణలో కుల గణన కూడా చేసేసింది. కాంగ్రెస్ నేరుగా అధికారంలో ఉన్నది కేవలం మూడు రాష్ట్రాల్లోనే. అవి తెలంగాణ, హిమాచల్ ప్రదేశ, కర్ణాటక. వీటిలో తెలంగాణ, కర్ణాటకలో కులగణన ప్రాధాన్యం సంతరించుకుంది.
అప్పట్లో తన ప్రభుత్వంలోనే..
కర్ణాటకలో కాంగ్రెస్ కీలక నాయకుడు సిద్ధరామయ్య. ఆయన ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతోంది. ఒప్పందం ప్రకారం మరికొద్ది రోజుల్లో సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవాలి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఆ పదవిని అప్పగించాలి. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మళ్లీ కులగణన చేపడతామని ప్రకటించారు. అది కూడా ఈ నెల 22 నుంచి అక్టోబరు 7వ తేదీ మధ్యనే అని తెలిపారు. వాస్తవానికి కర్ణాటకలో 2013-18 మధ్య సిద్ధరామయ్య ప్రభుత్వమే ఉంది. ఇదే సమయంలో 2015లో కుల గణన చేపట్టారు. కానీ, ఇప్పుడు ఆ నివేదికను అంగీకరించబోమని ఆయనే ప్రకటించారు.
ఇంతలోనే ఏమైంది...?
గతంలో చేపట్టిన కుల గణనకు పదేళ్ల పూర్తయిన నేపథ్యంలో దానిని అంగీకరించబోమని సిద్ధరామయ్య అంటున్నారు. ఇప్పటి పరిస్థితులను తెలుసుకోవాలంటే కొత్త సర్వే అవసరం అని పేర్కొంటున్నారు. ఇక 2015లో కర్ణాటకలో చేపట్టిన కుల గణన అప్పట్లో సంచలనమే సృష్టించింది. బీసీ కమిషన్ జస్టిస్ కాంతరాజ సారథ్యంలో కుల గణన నిర్వహించారు. ఈ సమాచారం ఆధారంగా కె.జయప్రకాశ్ హెగ్డే సారథ్యంలో పూర్తి నివేదిక తయారు చేసి గత ఏడాది ప్రభుత్వానికి అందించారు. కుల గణనతో పాటు ఆర్థిక, సామాజిక పరిస్థితులపైనా సర్వే సాగింది. ప్రభుత్వం కూడా ఆమోదించింది. కానీ, భిన్నాభిప్రాయాలు, పలు వర్గాల వారు ఆందోళనలకు దిగారు. దీంతో రాష్ట్రంలో మరోసారి కుల గణన చేపట్టనున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
