ప్రతీ ఎమ్మెల్యే కు 50 కోట్లు బంపర్ ఆఫర్...సిద్ధ రామయ్యా మజాకానా |
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బూర్లె గంపలోనే పడ్డారు. రెండేళ్ళ క్రితం ఎన్నికైన ఫలితం వారికి ఇపుడు కళ్ళ ముందు కనిపిస్తోంది.
By: Tupaki Desk | 18 July 2025 10:36 PM ISTకర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బూర్లె గంపలోనే పడ్డారు. రెండేళ్ళ క్రితం ఎన్నికైన ఫలితం వారికి ఇపుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. తాము ప్రజా ప్రతినిధులుగా నెగ్గినా ఏముంది అని నిట్టూర్చిన వారు అంతా ఇపుడు ఎగిరి గంతేసే వార్తను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. అది అలాంటి ఇలాంటి వార్త అయితే కాదు, అదిరిపోయే వార్త. ఒక్కో ఎమ్మెల్యేకు యాభై కోట్ల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం అని కేటాయిస్తున్నారు. ఇది గ్రాంట్ గా రిలీజ్ చేసేందుకు ముఖ్యమంత్రి కీలక నిర్ణయమే తీసుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా జరిపిన చర్చలు సుదీర్ఘమైన కసరత్తు తర్వాత సిద్ధరామయ్య ఈ ప్రకటన విడుదల చేశారు తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేసుకోవడానికి నిధులు సరిపోవడం లేదని చాలా మంది ఎమ్మెల్యేలు గోల పెడుతున్నారు వారంతా కలసి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రణదీప్ సూర్జేవాలా వద్ద తమ గోడు వెళ్ళబోసుకున్నారు
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అసంతృప్తి రాజుకుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో విడివిడిగా వారందరినీ కూర్చోబెట్టుకుని బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తమ మనసులో ఉన్న అసంతృప్తి ఏమిటో అంతా చెప్పేశారు. నిధుల జాప్యం వల్ల పట్టణ ప్రాంతాలోనే కాదు, గ్రామీణ ప్రాంతాలలోనూ కీలకమైన ప్రాజెక్టులు పనులు అన్నీ కుంటుపడుతున్నాయని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయం ఇంచార్జికీ చెప్పేశారు.
ఇక ఈ విషయం మీద సూర్జేవాలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల దృష్టిలోకి తేవడమే కాకుండా వారికి ఏమైనా చేయాలని సూచించారని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఈ మీటింగుల తరువాత చూస్తే చాలా కాలంగా పెండింగులో ఉన్న నిధుల విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారు అని అంటున్నారు. అలా ప్రతీ ఎమ్మెల్యే ఏకంగా 50 కోట్ల రూపాయల గ్రాంట్ ని పొందుతారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే కర్ణాటకలో కుర్చీలాట మొదలైంది అని ప్రచారంలో ఉంది. అక్కడ సిద్ధరామయ్యని దించేసి డీకే శివకుమార్ పదవిలోకి వస్తారు అని కూడా చర్చ నడుస్తోంది. అయితే ఈ రకమైన చర్చలు సాగుతూండగానే ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉండాలని అటు సీఎం సిద్ధరామయ్య, ఇటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళకు సిద్ధంగా ఉన్నారు అని కూడా వార్తలు విమర్శలు వస్తున్నాయి.
ఇంకో వైపు ఇదే సందు అన్నట్లుగా బీజేపీ కూడా కాచుకుని కూర్చుంది అంటున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆకర్షిస్తోంది అన్న వార్తలు కూడా వ్యాపిస్తున్నాయి . దీని మీద ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బీజేపీ మీద ఆరోపణలు చేశారు.
అయితే అవన్నీ అవాస్తవాలు అని బీజేపీ ఖండిస్తోంది. మరి ఈ రకమైన ప్రచారాలు కూడా ఉండడంతో ఎందుకైనా మంచిది ఎమ్మెల్యేలను మంచి చేసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ విధంగా చేశారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి ఏది ఏమైనా ఎమ్మెల్యేలకు నిధుల పంట పండుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇది నిజంగా పండుగ అని అంటున్నారు
