వై.ఎస్. జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ.!
జగన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రామగిరి ఎస్సై సుధాకర్ జగన్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు.
By: Tupaki Desk | 9 April 2025 10:16 AM ISTమాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాప్తాడు నియోజకవర్గ పర్యటనలో ఆయన మాట్లాడుతూ పోలీసులను బట్టలు ఊడదీయించి కొడతామని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని, చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేసే పోలీసు అధికారులకు శిక్ష తప్పదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి పోలీసులపై చర్యలు తీసుకుంటామని, వారి యూనిఫామ్‌లు తీయించి చట్టం ముందు నిలబెడతామని, ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తామని జగన్ తీవ్రంగా హెచ్చరించారు.
టీడీపీ నాయకుల అరాచకాలతో రాష్ట్రంలో బిహార్ లాంటి పరిస్థితులు నెలకొన్నాయని జగన్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికలలో వైసీపీ కార్యకర్త లింగమయ్యను టీడీపీ గూండాలు చంపడం దారుణమని, ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని, శాంతి భద్రతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు గాలికొదిలేశారని ఆయన ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు రెడ్‌బుక్ పాలనకు నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. గతంలో కూడా ఐదుసార్లు జగన్ పోలీసులను నేరుగా బెదిరించారని సమాచారం.
జగన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రామగిరి ఎస్సై సుధాకర్ జగన్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు. "యూనిఫాం నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు. కష్టపడి చదివి.. రన్నింగ్ రేసుల్లో, చదివి పాస్ అయ్యి ఎన్నో వేల మందిని దాటి పోటీపరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇదీ.. మేం ప్రజల పక్షాన నిజాయితీగానే పనిచేస్తాం.. నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం.. నిజాయితీగానే చస్తాం.. అడ్డమైన దారులు తొక్కం.. నువ్వు వచ్చి ఊడదీస్తా అంటే ఇది అరటితొక్క కాదు జాగ్రత్తగా మాట్లాడు" అంటూ ఎస్సై సుధాకర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు జగన్ వ్యాఖ్యలకన్నా పెద్ద సంచలనంగా మారింది.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన ఈ హెచ్చరికలు, దానికి పోలీసు అధికారి స్పందించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.
