Begin typing your search above and press return to search.

అంతరిక్షయానం నుండి ఇంటికి... శుభాంశు భావోద్వేగం

గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య కలుస్తున్న దృశ్యాలు అందరి హృదయాలను హత్తుకున్నాయి.

By:  Tupaki Desk   |   17 July 2025 1:02 PM IST
అంతరిక్షయానం నుండి ఇంటికి... శుభాంశు భావోద్వేగం
X

అంతరిక్ష యానం ఎప్పుడూ సవాళ్లతో కూడుకున్నదే. శుభాంశు శుక్లా కూడా ఈ సవాళ్లను ఎదుర్కొన్నారు. ISS కోసం ఆయన రెండు నెలలకు పైగా స్పేస్ క్వారంటైన్‌లో గడపాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన దూరం నుంచే తన కుటుంబాన్ని చూడాల్సి వచ్చింది. ఆ ఒడిదుడుకులను అధిగమించి భూమికి తిరిగి వచ్చిన తర్వాత, తన కుటుంబ సభ్యులను కలుసుకున్న క్షణాలు ఆయన జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం.


గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య కలుస్తున్న దృశ్యాలు అందరి హృదయాలను హత్తుకున్నాయి. 1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండవ భారతీయుడిగా శుభాంశు చరిత్రలో నిలిచారు. ఈ పునఃసంధానం క్షణాలలో కుటుంబ సభ్యుల ఆనందం, గర్వం, భావోద్వేగం శుభాంశు ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రతిబింబిస్తున్నాయి.


-శుభాంశు మాటల్లో...

ఈ భావోద్వేగ క్షణాలను శుభాంశు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "అంతరిక్షయానం అద్భుతం. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడం సైతం అంతే అద్భుతం. ఈ ప్రయాణం కోసం రెండు నెలలు క్వారంటైన్‌లో గడిపాను. ఈ సమయంలో దూరం నుంచి నా కుటుంబాన్ని చూడాల్సి వచ్చింది. భూమికి తిరిగివచ్చి ఫ్యామిలినీ హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోంది. కొన్నిసార్లు మనం బిజీగా ఉంటాం. మన జీవితాల్లోని వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో మర్చిపోతుంటాము. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వారిని కలిశాను. అంతరిక్ష ప్రయాణాలు మాయాజాలంగా అనిపిస్తాయి. అయితే మనుషుల వల్లే అవి అలా మారాయి" అని శుభాంశు పోస్ట్ చేశారు.


-భార్య కమ్నా ఆనందం

శుభాంశు తిరిగి వచ్చినందుకు ఆయన భార్య కమ్నా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. "శుభాంశు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఈ అద్భుత ప్రయాణం తర్వాత తను తిరిగి మమ్మల్ని కలవడమే మాకు అతిపెద్ద సెలబ్రేషన్. ఇకపై తను మునుపటి జీవితాన్ని కొనసాగించడంపైనే తాము దృష్టి నిలుపుతాము. అంతరిక్షంలో ఉన్న సమయంలో తను ఇంటి ఆహారాన్ని మిస్ కావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చాక తనకు ఇష్టమైన ఆహారాన్ని వండేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నా" అని కమ్నా పేర్కొన్నారు.

-మిషన్ పూర్తి... పునరావాసం వైపు

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ (పోలాండ్), టిబర్ కపు (హంగరీ)లతో కలిసి ISSకు వెళ్లిన శుభాంశు, 18 రోజుల అనంతరం భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు భూమిపైకి సురక్షితంగా చేరారు. వారు ప్రయాణించిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగింది. అనంతరం వారిని భూవాతావరణ పరిస్థితులకు అలవాటుపడడానికి హూస్టన్‌లోని పునరావాస శిబిరానికి తరలించారు. అక్కడ వారికి మెడికల్ పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటు ఈ నలుగురు వ్యోమగాములు పునరావాస శిబిరంలోనే గడపనున్నారు. భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన శుభాంశు శుక్లాకు దేశమంతటా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.