Begin typing your search above and press return to search.

అంతరిక్ష జర్నీ వేళ ఎక్కువగా నిద్ర పోయిన శుభాంశు

గడిచిన కొంతకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. భారత అంతరిక్ష చరిత్రలో ఐఎస్ఎస్ ను చేరిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు క్రియేట్ చేయటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jun 2025 12:55 PM IST
అంతరిక్ష జర్నీ వేళ ఎక్కువగా నిద్ర పోయిన శుభాంశు
X

గడిచిన కొంతకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. భారత అంతరిక్ష చరిత్రలో ఐఎస్ఎస్ ను చేరిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు క్రియేట్ చేయటం తెలిసిందే. 39 ఏళ్ల శుభాంశు బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు బయలుదేరి.. గురువారం సాయంత్ం 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్దకు చేరుకోవటం తెలిసిందే. అనుకున్న దాని కంటే అరగంట ముందే.. అంతరిక్ష కేంద్రంలోకి ఆయన వెళ్లారు.

భారతీయ ఫైటర్ పైలట్ అయిన శుభాంశు శుక్లా.. తన ప్రయాణ అనుభవాన్ని వివరించారు. ఐఎస్ఎస్ కేంద్రంలోకి అడుగు పెట్టిన తర్వాత తన ప్రయాణ అనుభవాన్ని శుభాంశు వెల్లడించారు. మొత్తం పద్నాలుగు రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఈ సందర్భంగా భూమిపై ఉన్న వారితో తాను మాట్లాడతానని చెప్పిన ఆయన.. తన ప్రయాణ అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

మువ్వెన్నెల జెండాను.. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లినట్లుగా చెప్పిన శుభాంశు.. ‘‘ఐఎస్ఎస్ కు ప్రయాణం అద్భుతంగా ఉంది. ఇక్కడి సిబ్బంది మమ్మల్ని స్వాగతించిన తీరు ఆమోఘం. ఐఎస్ఎస్ లోకి ప్రవేశించిన నిమిషం.. నేను ఇక్కడి సిబ్బందిని కలుసుకున్న వేళ నేను ఉద్విగ్నతకు గురయ్యా. ఐఎస్ఎస్ తలుపులు తెరుస్తుంటే.. ఇంటి డోర్లు తెరిచినట్లుగా అనిపించింది. ఇక్కడికి వచ్చే ముందు నేను ఊహించిన దాని కన్నా బాగుంది. అందరికి థ్యాంక్స్ ’ అని చెప్పుకొచ్చాడు.

తన ప్రయాణం గురించి చెబుతూ ఒక వీడియోను విడుదల చేసిన శుభాంశు.. ‘‘భారతరహిత స్థితిలో జీవించాటాన్ని చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నా. శూన్యంలో ప్రయాణించటం అద్భుతంగా ఉంది. ఇక్కడ నిల్చోవటం సులువుగా ఉంది. తల కొంచెం భారంగా ఉంది. కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. కానీ.. అవన్నీ చిన్నవే. ప్రయోగ సమయంలో తీవ్రస్థాయి గురుత్వాకర్షణ బలాల్ని ఎదుర్కొన్నప్పుడు సీట్లో నుంచి తోసేసినట్లు ఉంది. ప్రయాణం ప్రారంభించిన తర్వాత కొత్తగా అనిపించింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దంగా మారింది. గాల్లో తేలుతున్నట్లు అనిపించింది. పయోగం ప్రారంభమయ్యాక నేను చాలాసేపు నిద్రపోయానని తోటి వ్యోమగాములు చెప్పారు. పరిసరాల్ని చూస్తూ మైమరిచిపోయా’ అని తన అనుభవాల్ని వివరంగా చెప్పుకొచ్చారు.

ఇక్కడ ఒక ప్రశ్న మీకు రావొచ్చు. ఇప్పటికే చాలామంది వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కదా? వారికి.. శుభాంశుకు తేడా ఏమిటని? తేడా చాలానే ఉంది. అదెలానంటే.. ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలు జరగటం.. ఎందరో వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లటం తెలిసిందే. భారత మూలాలు ఉన్న వ్యోమగాములు వెళ్లినప్పటికి.. శుభాంశు వ్యవహారం వేరు. ఎందుకంటే.. అతగాడు అసలుసిసలు భారతీయులు.

మిగిలిన దేశాల వారితో పోలిస్తే.. భారతీయుల భావోద్వేగాలు వేరుగా ఉంటాయి. విషయాల్ని చూసే విషయంలో ఒక్కో దేశం వారు ఒక్కోలాంటి తీరును ప్రదర్శిస్తారు. భారతీయులు ఎలా ఆలోచిస్తారు? వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయి? మనం అంతరిక్షంలోకి వెళితే ఏయే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామన్న దానికి ఇప్పటివరకు సరైన సమాధానం లేదు. కానీ..ఇప్పుడు మనోడు అంతరిక్షంలో ఉన్నాడు. మన ఆలోచనలకు తగ్గట్లు కొన్ని అయినా శుభాంశు చేస్తాడు. అందుకే.. ఆయన అనుభవాలు తెలుసుకోవటం ద్వారా.. మనకుండే ఎన్నో సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి.