భూమికి తిరిగొచ్చిన శుభాంశు.. 18 రోజుల్లో ఎన్ని ప్రయోగాలు చేశారంటే..!
అలా ఈ గత నెల 26 నుంచి 18 రోజుల పాటు ఈ వ్యోమగాములు రోదసిలో 60 ప్రయోగాలు నిర్వహించారు.
By: Tupaki Desk | 16 July 2025 2:00 PM ISTభారత రోదసి చరిత్రలో ఒక కీలక అంకం సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ఇందులో భాగంగా... భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.)లో 18 రోజులపాటు గడిపిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా.. భూమికి చేరుకున్నారు. 41 ఏళ్ల తర్వాత భారత పౌరుడొకరు రోదసి యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకొన్నారు.
అవును... శుభాంశు శుక్లా భారత్ కు క్షేమంగా తిరిగివచ్చారు. యాక్సియం-4 మిషన్ లో భాగంగా శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్ కీ - విస్నియెస్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ)లు గత నెల 25న ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి బయల్దేరిన సంగతి తెలిసిందే. 28 గంటల ప్రయాణం తర్వాత.. వారి వ్యోమనౌక ఐ.ఎస్.ఎస్.తో అనుసంధానమైంది.
అలా ఈ గత నెల 26 నుంచి 18 రోజుల పాటు ఈ వ్యోమగాములు రోదసిలో 60 ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో భారత్ కు సంబంధించిన 7 ప్రయోగాలను శుక్లా నిర్వహించారు. అనంతరం భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3:01 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో పసిఫిక్ మహాసముద్రంలో వారు ప్రయాణించిన క్యాప్సుల్ దిగింది.
అయితే... అది అమెరికాలో రాత్రి సమయం కావడంతో శక్తిమంతమైన లైట్ల వెలుగులో సహాయ బృందాలు బోట్ల సహాయంతో వ్యోమనౌకను చేరుకున్నాయి. అనంతరం డ్రాగన్ వ్యోమనౌక తలుపును తెరిచి.. వ్యోమగాములను బయటకు తెచ్చాయి. 20 రోజుల పాటు రోదసిలోని భారరహిత స్థితికి అలవాటుపడ్డ వ్యోమగాములు.. భూమిపైకి చేరిన తర్వాత నిలబడటానికి ఇబ్బందిపడ్డారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) యాక్సియం-4 మిషన్ కోసం సుమారు రూ.550 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం ఖర్చులో శుభాన్షు శుక్లా శిక్షణ, ప్రయోగ ఏర్పాట్లు, ప్రయాణ ఖర్చులు, అంతరిక్షంలో జరిగే పరిశోధనలకు సంబంధించిన ఉన్నాయని అంటున్నారు. అతని ఈ ప్రయాణం ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో భారత ఉనికిని మరింత బలంగా చాటి చెబుతుంది!
ఇక ఇస్రో వ్యోమగాముల వేతనాల విషయానికొస్తే... గగన్ యాన్ కార్యక్రమంతో సంబంధం ఉన్న భారతీయ వ్యోమగాములు సాధారణంగా సంవత్సరానికి రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సంపాదిస్తారు! ఈ జీతంలో బేసిక్, అలవెన్సులు, ఇతర ప్రభుత్వ ఆమోదించిన ప్రయోజనాలు ఉంటాయి. అమెరికాలోని వ్యోమగాములు ఏడాదికి సుమారు రూ.56లక్షలు నుంచి రూ.86 లక్షల వరకు సంపాదిస్తారు.
కాగా... సుమారు 41 ఏళ్ల క్రితమ్ 1984లో రాకేశ్ శర్మ రోదసియాత్ర చేశాక భారత వ్యోమగామి ఒకరు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారనే సంగతి తెలిసిందే. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తొలి భారతీయుడిగా, రోదసిలో అత్యధిక కాలం గడిపిన భారతవాసిగా శుభాంశు రికార్డు సృష్టించారు.
మరోవైపు యాక్సియం-4 మిషన్ లో శుక్లా పాత్రను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. దేశ అంతరిక్ష పరిశోధనల్లో, అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో ఒక కొత్త మైలురాయిని ఆయన స్థాపించారని చెప్పారు. ఇదే సమయంలో... శుభాంశుకు దేశ ప్రజలందరితో కలిసి స్వాగతం పలుకుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆయన తన అంకితభావం, ధైర్యం, మార్గదర్శకత్వంతో కోట్లమంది భారతీయుల్లో స్ఫూర్తిని రగిలించారని కొనియాడారు.
