హైఓల్టేజ్ డ్రామా వీడియో... ఐదో అంతస్తు ఎక్కి లైవ్ ఇచ్చిన మోస్ట్ వాంటెడ్!
తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులకు హై వోల్టేజ్ డ్రామా చూపించాడో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.
By: Tupaki Desk | 8 Jun 2025 8:45 AM ISTతనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులకు హై వోల్టేజ్ డ్రామా చూపించాడో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇందులో భాగంగా... పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఐదవ అంతస్తు టెర్రస్ పైకి ఎక్కి సోషల్ మీడియాలో లైవ్ వీడియో మొదలుపెట్టాడు.. తన వద్దకు వస్తే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
అవును... అహ్మదాబాద్ లో ఓ వాంటెడ్ క్రిమినల్ ఐదవ అంతస్తు పైకి ఎక్కి దూకుతానని బెదిరించడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో.. తీవ్ర నాటకీయ పరిణామాలు నెలకొంది. అతడిని అభిషేక్ అలియాస్ షూటర్ గా గుర్తించారు! ఈ సందర్భంగా... పోలీసులకు లొంగిపోవడం కంటే మరణాన్ని ఎంచుకోవడమే మంచిదని అభిషేక్ వీడియోలో ప్రకటించాడు!
అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కు శివం ఆవాస్ లోని ఫ్లాట్ నెంబర్ 505లో అభిషేక్ ఉన్నట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడి ఇంటికి వచ్చి తలుపు తట్టారు. అయితే.. డోర్ తెరవడానికి అతడు నిరాకరించాడు. అనంతరం.. కిచెన్ కిటికీ నుంచి బయటకు వచ్చి పారిపోవడానికి టెర్రస్ పైకి చేరుకున్నాడు.
ఈ సమయంలో అభిషేక్ ఐదవ అంతస్తు గట్టుపై అనిశ్చితంగా నిలబడి ఉండటం కనిపించింది. అభిషేక్ అప్పుడు తన మొబైల్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం మొదలుపెట్టాడు. అక్కడ నుంచి దూకేస్తానని బెదిరించాడు. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.
ఈ సమయంలో అభిషేక్ ను లొంగిపోవడానికి ఒప్పించేలా క్రైమ్ బ్రాంచ్ అధికారి ప్రయత్నించగా... మీకు దొరిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు.. అది చాలా దారుణంగా ఉంటుంది.. అందువల్ల, మీకు లొంగిపోవడం కంటే చనిపోవడం మంచిది అని చెప్పాడు. అయితే.. అతని పట్ల న్యాయంగా, గౌరవంగా వ్యవహరిస్తామని వారు పదే పదే హామీ ఇచ్చారు.
అయినప్పటికీ అభిషేక్ ఎంట్రీ ఇవ్వకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఎంట్రీ ఇచ్చింది. ఈ సమయంలో సుమారు మూడు గంటల సుదీర్ఘమైన, సున్నితమైన చర్చల తర్వాత అగ్నిమాపక సిబ్బంది అభిషేక్ ను విజయవంతంగా రక్షించి పోలీసులకు అప్పగించింది. దీంతో.. వారు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.