Begin typing your search above and press return to search.

పల్నాడు జిల్లాలో ట్రావెల్ బస్సును ఢీ కొన్న టిప్పర్.. ఆరుగురు సజీవదహనం

బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు.. చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ కు వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు బయలుదేరారు.

By:  Tupaki Desk   |   15 May 2024 4:01 AM GMT
పల్నాడు జిల్లాలో ట్రావెల్ బస్సును ఢీ కొన్న టిప్పర్.. ఆరుగురు సజీవదహనం
X

సొంతూరు మీద మమకారంతో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి మరీ వచ్చిన వారు ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒకటి ప్రమాదానికి గురి కావటం.. ఈ విషాద ఉదంతంలో ఆరుగురు సజీవ దహనం కావటం షాకింగ్ గా మారింది. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ దారుణ ఘటనకు పల్నాడు జిల్లా వేదికగా మారింది. ఓటేసిన ఆనందంతో బంధుమిత్రులతో సంతోషంగా గడిపిన వారు.. బోలెడన్ని తీపిగురుతులతో తిరుగు ప్రయాణమైన వారు.. తమ ప్రయాణం కాస్తంత సేపు సాగిందో లేదో.. అంతలోనే వారి ప్రాణాల్ని తీసేందుకు టిప్పర్ రూపంలో వచ్చి.. ఆరుగురి ప్రాణాల్ని తీయగా.. పలువురిని గాయాలపాలు చేసింది. మరణించిన ఆరుగురిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ఇంతకూ ఈ దారుణ ప్రమాదం ఎలా జరిగిందంటే..

బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు.. చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ కు వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు బయలుదేరారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది చినగంజాం.. గొనసపూడి.. నీలాయపాలెం వారు ఎక్కువ. వీరిలో అత్యధికులు ఓటు వేసేందుకు ఊళ్లకు వచ్చి.. తిరిగి వెళుతున్న వారే. వీరి ప్రయాణం మొదలైన కొన్ని గంటలకు మంగళవారం అర్థరాత్రి 1.30 గంటల వేళలో వేగంగా వెళుతున్న బస్సును.. మరింత వేగంగా కంకర లోడ్ తో వచ్చిన టిప్పర్ ఢీ కొంది. దీంతో క్షణాల్లో మంటలు అంటుకున్నాయి.

రెండు వాహనాలు తీవ్రమైన వేగంతో ఢీ కొనటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో ట్రావెల్ బస్సు డ్రైవర్.. మరో ఐదుగురు మంటలకు బలయ్యారు. మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలు.. బంధువుల శోకాలతో ఆ ప్రాంతం మొత్తం విషాదంగా మారింది. ఈ ప్రమాదం గురించి తెలిసినంతనే స్థానికులు సహాయక చర్యలు మొదలు పెట్టారు. పోలీసులకు.. 108కు సమాచారాన్ని అందించటం.. వారు అంతే వేగంగా స్పందించారు.

బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి.. 108 వాహనాల్లో చిలకలూరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వచ్చిన ఫైరింజన్ కారణంగా మంటలు త్వరగా ఆరిపోయాయి. ఇంతకూ ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంలోకి వెళితే.. స్థానికులు అందిస్తున్న సమాచారం ప్రకారం బైపాస్ వర్కు జరుగుతున్న వేళ.. తారు రోడ్డుపై మట్టి పెద్ద ఎత్తున పేరుకుపోయింది. టిప్పర్ వేగంగా దూసుకురావటం.. టిప్పర్ డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆరు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

మరణించిన వారు వీరే..

- బస్సు డ్రైవర్ అంజి (35), చీరాల

- ఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం

- ఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం

- ముప్పురాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం. మిగిలిన ఇద్దరి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.