Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో దారుణం: హత్య చేసి ఇన్ స్టాలో సెల్ఫీ వీడియో

ఎస్ఆర్ నగర్ లోని దాసారం బస్తీకి చెందిన 21 ఏళ్ల తేజస్ అలియాస్ సిద్ధూ మీద ఒక హత్య కేసు ఉంది.

By:  Tupaki Desk   |   8 April 2024 12:00 PM IST
హైదరాబాద్ లో దారుణం: హత్య చేసి ఇన్ స్టాలో సెల్ఫీ వీడియో
X

హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఒక హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. కారణం.. దారుణంగా చంపేయటమే కాదు.. తాము హత్య చేసిన అనంతరం పార్టీ చేసుకోవటం.. ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసే బరితెగింపు చూస్తే నోట మాట రాదంతే. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లుగా చెబుతున్నారు.

ఎస్ఆర్ నగర్ లోని దాసారం బస్తీకి చెందిన 21 ఏళ్ల తేజస్ అలియాస్ సిద్ధూ మీద ఒక హత్య కేసు ఉంది. గత ఏడాది జరిగిన హత్యలో ఏ3గా ఉన్నాడు. ఈ కేసులో జైలుకు వెళ్లిన అతను రెండు నెలల క్రితమే బయటకు వచ్చాడు. ప్రస్తుతం ప్రగతినగర్ లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తల్లితో కలిసి ఉంటున్నాడు. ఆదివారం సిద్ధూ తల్లి ఊరుకు వెళ్లింది. దీంతో సిద్ధూ తన మిత్రులతో కలిసి పార్టీ చేసుకొని మందు తాగాడు.

సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల వేళలో ప్రగతినగర్ లోని బతుకమ్మ ఘాట్ ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఇదిలా ఉంటే.. గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు దాదాపు 20 మంది టూవీలర్ల మీద వచ్చి సిద్ధూను చుట్టుముట్టారు. కత్తులతో పొడిచి చంపేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హత్య తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో ద్వారా మర్డర్ ను షూట్ చేసి ఇన్ స్టాలో పోస్టు చేశారు. తరుణ్ హత్యకు ప్రతీకారంగా తాము తమ పగను తీర్చుకున్నామని వెల్లడించటం గమనార్హం. ఈ హత్యకు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ హత్య ఉదంతం సంచలనంగా మారింది.