నిండు గర్భిణిని హత్య చేసిన భర్త దురాగతాలెన్నో
అనంతరం మధురవాడలో కాపురం పెట్టి.. తాను బెంగళూరులో ఉన్నట్లుగా తల్లిదండ్రుల్ని నమ్మించాడు.
By: Tupaki Desk | 16 April 2025 3:00 PM ISTనిండు చూలాలు. పగోడు సైతం అయ్యో పాపం అనేస్తారు. అలాంటిది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినట్లుగా నటించి.. ఆమెను శారీరకంగా వాడుకోవటం కోసం పెళ్లి అనే నాటకానికి తెర తీసి.. చివరకు ఆమెను వదిలించుకోవటం కోసం వేసిన ఎత్తులు..చేసిన దుర్మార్గాల గురించి తెలుసుకున్న పోలీసులు సైతం అవాక్కు అవుతున్నారు. మరీ.. ఇంత కసాయితనమా అంటూ షాక్ తింటున్న దుస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నిండు గర్భిణి అనూష హత్యకు సంబంధించి విస్మయానికి గురి చేసే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
ప్రేమ పేరుతో వెంటపడినప్పటి నుంచి ఇతడెంత కుట్ర పూరితంగా ప్లాన్ చేశాడన్నది తెలిస్తే.. వీడిని ఏం చేసినా పాపం ఉండదన్న ఆగ్రహం కలుగుతుంది. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులోని ఉన్న కాలేజీలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్నప్పుడు ప్రేమ పేరుతో అనూష వెంట పడ్డాడు జ్ఞానేశ్వర్. అతడి మాయమాటలకు నమ్మి ప్రేమలో పడింది. అయితే.. పెళ్లికి ముందే శారీరకంగా ఒకటవుదామని పలుమార్లు ప్రయత్నించినా ఆమె ససేమిరా అనేది. పెళ్లి తర్వాతే ఏమైనా అని తేల్చటంతో.. ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు.
అనంతరం మధురవాడలో కాపురం పెట్టి.. తాను బెంగళూరులో ఉన్నట్లుగా తల్లిదండ్రుల్ని నమ్మించాడు. పెళ్లైన తర్వాత నుంచి ఆమెను ఏదోలా వదిలించుకోవాలని ప్రయత్నించాడు. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రయత్నాలు చేసి.. విడాకులు తీసుకుందామని ఒత్తిడికి గురి చేసేవాడు. పెళ్లై రెండేళ్లు అయినప్పటికి ఇంట్లో రెండు మంచాలు.. వంట సామాగ్రి తప్పించి మరెలాంటి సౌకర్యాలు లేకుండా వ్యవహరించేవాడు.
ఆమెతో కలిసి ఫోటోలు దిగితే ఫ్రెండ్ ద్వారా బయటకు వెళతాయన్న ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకునేవాడు. గర్భిణిగా ఉన్నప్పుడు ఒకసారి ఫలూదా తాగాలని అడిగితే.. తీసుకొచ్చి అందులో నిద్రమాత్రలు కలిపి తాగించాడు. అయితే.. ఒకమాత్ర గ్లాసులో కరగకుండా ఉన్న మాత్రను గుర్తించిన అనూష అదేమిటని అడిగితే..తనకేమీ తెలీదని బుకాయించిన వైనం వెలుగు చూసింది. ఆదివారం అర్థరాత్రి భార్యను హత్య చేసిన తర్వాత తనను తాను అమాయకుడిగా నటిస్తూ.. పెద్ద నాటకమే చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
తన భార్యను ఎంత కదిపినా కదలటం లేదని స్థానికుల ముందు కంగారు నటించి.. చుట్టుపక్కల వారి సాయంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చనిపోయినట్లుగా డాక్టర్లు చెప్పిన సమయంలో ఆమె మెడపై ఉన్న మచ్చను అనూష స్నేహితురాలి తల్లి గుర్తించింది. దీనికి తోడు అనూష శరీరం నల్లగా ఉబ్బిపోవటంతో అనుమానం వ్యక్తం చేసింది. దీంతో.. కేజీహెచ్ కు తరలించి..పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన నిండు గర్భిణి అనూషకు పోస్టుమార్టం జరిపిన వైద్యులు.. ఆమె గర్భం నుంచి చనిపోయిన ఆడశిశువును బయటకు తీశారు. ఈ ఘటన అందరిని తీవ్రంగా కలిచివేసింది. జ్ఞానేశ్వర్ కసాయితనం ఇప్పుడు అందరిని విభ్రాంతికి గురి చేస్తోంది.
