Begin typing your search above and press return to search.

ప్రేమించి.. పెళ్లంటే చంపేశాడు: శవంతో 105 కి.మీ. జర్నీ

విశాఖ జిల్లా సాలూరు మండలానికి చెందిన 20 ఏళ్ల ఐశ్వర్య ఒక వస్త్రదుకాణంలో పని చేస్తుంది.

By:  Tupaki Desk   |   1 April 2025 9:00 PM IST
ప్రేమించి.. పెళ్లంటే చంపేశాడు: శవంతో 105 కి.మీ. జర్నీ
X

ఈ దుర్మార్గ ప్రేమికుడి గురించి తెలిస్తే.. ఇలాంటోడు కూడా ఉంటాడా? అనిపిస్తుంది. అంతేకాదు.. ఎంత స్నేహమైతే మాత్రం దారుణ నేరం చేసిన తర్వాత తప్పించేందుకు సాయం చేసిన ఇద్దరు స్నేహితుల వైనం ఆందోళనకు గురి చేస్తుంది. ప్రేమించిన పాపానికి ప్రాణాలు తీసేసిన ఈ సైకో ప్రేమికుడు.. చంపేసిన తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకోవటానికి చేసిన ప్రయత్నాల గురించి తెలిస్తే.. ఇలాంటి స్టోరీలు సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి కదా? అనుకోకుండా ఉండలేం. అసలేం జరిగిందంటే.

విశాఖ జిల్లా సాలూరు మండలానికి చెందిన 20 ఏళ్ల ఐశ్వర్య ఒక వస్త్రదుకాణంలో పని చేస్తుంది. ఆమెకు రాంబాబు అనే యువకుడితో పరిచయమైంది. అతనికి అప్పటికే పెళ్లైంది. కానీ.. ఈ విషయం ఐశ్వర్యకు తెలీదు. అతను ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేస్తుంటాడు. రాంబాబుతో పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలంగా సాగుతున్న ప్రేమకు పెళ్లితో శుభం కార్డు వేయాలని అడిగేది. అతను ఆ ప్రస్తావనను తప్పించేవాడు. ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరు సొంతూరుకు రావటం..తిరిగి వైజాగ్ కు వెళ్లేందుకు బండి మీద కలిసి వెళ్లాలని ప్లాన్ చేశారు. అరిలోవ సమీపంలో వీరి మధ్య మళ్లీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. దీనిపై ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఐశ్వర్య గొంతుకు తాడు బిగించిన రాంబాబు ఆమెను చంపేశాడు.

ఒక స్నేహితుడు సాయంతో టూవీలర్ మీద రాత్రివేళలో సాలూరుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బండి మీద ఆమెను మధ్యలో కూర్చోబెట్టి ముఖానికి చున్నీ కట్టేశారు. నేషనల్ హైవే మీద అయితే పోలీసులు పట్టుకుంటారన్న ఆలోచనతో పలు గ్రామాల్లో అడ్డదారుల్లో 105 కి.మీ. ప్రయాణించి సాలూరు మండలంలోని చీపురువలసకు తీసుకొచ్చారు. వీరు ప్రయాణిస్తున్న టూవీలర్ లో పెట్రోల్ అయిపోవటంతో మరో స్నేహితుడి సాయంతో పెట్రోల్ తెప్పించుకున్నారు. ఈ ముగ్గురు కలిసి ఒక జీడితోటలో ఆమెకు ఉరి బిగించి.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసినంతనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అక్కడున్న పరిస్థితులు సందేహాస్పదంగా ఉండటంతో మరింత లోతుగా విచారించారు. ఈ క్రమంలో 48 గంటల్లోనే ఆమెది హత్య కాదు ఆత్మహత్య అన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతడికి సాయం చేసిన ఇద్దరినీ అరెస్టు చేయాల్సి ఉంది. పరారీలో ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు గాలింపులు చేపట్టారు.