Begin typing your search above and press return to search.

పెళ్లొద్దని చెబితే పోలా..విడిపోతే సరిపోలా.. చంపడం, చంపించడం ఎందుకు?

ఇవన్నీ వరుసగా జరిగిన ఘటనలు.. వీటిని చూస్తుంటే సమాజంలో నేర ప్రవృత్తి ఎంతగా పెరుగుతోందో చాటుతోంది.. అందులోనూ మహిళల పాత్ర ఉండడమే ఆందోళన కలిగిస్తోంది.

By:  Tupaki Desk   |   26 Jun 2025 10:00 AM IST
పెళ్లొద్దని చెబితే పోలా..విడిపోతే సరిపోలా.. చంపడం, చంపించడం ఎందుకు?
X

సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.. యువకుడిని ప్రేమించిన బాలిక తల్లిని చంపించింది.. బ్యాంకు ఉద్యోగితో అక్రమ సంబంధం ఉన్న యువతి.. దానిని దాచి అమాయక వ్యక్తిని పెళ్లాడి.. ఆ తర్వాత అతడిని హతమార్చేందుకు పథకం వేసింది.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించింది భార్య. ఇవన్నీ వరుసగా జరిగిన ఘటనలు.. వీటిని చూస్తుంటే సమాజంలో నేర ప్రవృత్తి ఎంతగా పెరుగుతోందో చాటుతోంది.. అందులోనూ మహిళల పాత్ర ఉండడమే ఆందోళన కలిగిస్తోంది.

గతంలోనూ ఇలాంటివి కొన్ని ఘటనలు జరిగాయి. తాజాగా హైదరాబాద్‌, గద్వాల, అనంతపురంలో వరుసగా చోటుచేసుకున్నవి కావడంతో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలోని గద్వాలలో ప్రైవేట్‌ సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య ఉదంతం పెద్ద కలకలమే రేపింది. ఒకసారి ఆగిపోయిన వివాహాన్ని అతడు తిరిగి చేసుకోవడం ఏమిటో...? ఐదుసార్లు హత్యాయత్నాలు తప్పి ఆరోసారి దొరికిపోవడం ఏమిటో? వైవాహిక జీవితం బాగుంటుందని భావిస్తున్న తరుణంలో అతడు ప్రాణాలు కోల్పోవడం ఏమిటో..? అని అందరినీ కలచివేసింది.

ఇక హైదరాబాద్‌లో బాలిక ఓ యువకుడిని ప్రేమించి.. దానిని వ్యతిరేకించి అతడిపై కేసు పెట్టించినందుకు తల్లిని ఆ యువకుడితోనే చంపించింది. ఇది ఆ యువకుడిపై రెండో కేసు కాగా, అతడి సోదరుడు కూడా హత్య కేసులో చిక్కుకున్నాడు.

బుధవారం ఏపీలోని అనంతపురం జిల్లా అక్కంపల్లిలో చిన్న హోటల్‌ నడిపే సురేష్‌బాబు (43)ను అతడి భార్యే చంపించింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది.

కాగా, ఇలా వెలుగులోకి వస్తున్నవి కొన్ని ఘటనలే..! ఇలాంటివి ఇంకా ఎన్నో..? వీటి నేపథ్యంలోనే పెళ్లివద్దని చెబితే పోలా... లేదా భర్తతో విడిపోతే పోలా..? కట్టుకున్నవారిని చంపించడం, చంపడం ఎందుకు? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు వివాహేతర సంబంధాలు అనేవి మత్తులాంటివి. అందులో మునిగినవారు జరగబోయే అనర్థాలను తెలుసుకోలేరు. ఆ మత్తే నేరాలకు దారితీస్తుంది.

ఇక అక్రమ సంబంధాల మత్తులో ఉన్నవారు తమ కుటుంబం పరిస్థితి ఏమిటో ఆలోచించడం లేదు. కట్టుకున్నవారినే కాదు కన్నవాళ్లను కూడా చంపేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇలా తాము నేరాల్లో చిక్కకుంటే కుటుంబం పరువు ఏమవుతుంది? అనేది ఊహించడం లేదు. హత్యలు చేసే, చేయించే ధైర్యం ఉన్నప్పుడు.. ఇష్టం లేదని విడిపోయే సాహసం చేయలేరా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.