Begin typing your search above and press return to search.

వెంటిలేటర్ పై ఉన్న ఎయిర్ హోస్టెస్ పై లైం*గిక దాడి

గురుగ్రామ్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.

By:  Tupaki Desk   |   16 April 2025 1:23 PM IST
Shocking Incident Air Hostess Assaulted on Ventilator
X

గురుగ్రామ్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 46 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌పై ఆసుపత్రి సిబ్బంది లైం*గికంగా దాడి చేశారని పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., బాధితురాలు ఒక హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టిన తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఏప్రిల్ 5న గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఏప్రిల్ 6న తాను వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో కొంతమంది ఆసుపత్రి సిబ్బంది తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేసి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు సోమవారం సదర్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ విషయంపై గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ, "బాధితురాలి వాంగ్మూలాన్ని కోర్టులో మెజిస్ట్రేట్ ముందు నమోదు చేశాం. మా పోలీసు బృందం ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తోంది. త్వరలోనే నిందితులను గుర్తిస్తాం" అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.