శోభన్ బాబు మనమడ్ని చూశారా? అతడు సాధించిన ఘనతలు తెలుసా?
అబ్బాయిలు అందంగా ఉండటమా? అమ్మాయిలు సైతం ఆసూయ పడే అందం ఉండే మగాళ్లలో నాటి తరం సూపర్ స్టార్ శోభన్ బాబు ముందు ఉంటారు.
By: Tupaki Desk | 4 May 2025 10:06 AM ISTఅందమంటే అమ్మాయిదే. అబ్బాయిలు అందంగా ఉండటమా? అమ్మాయిలు సైతం ఆసూయ పడే అందం ఉండే మగాళ్లలో నాటి తరం సూపర్ స్టార్ శోభన్ బాబు ముందు ఉంటారు. ఆయన గురించి.. అతడికి తెలుగు ప్రజల్లో ఉండే క్రేజ్ గురించి ఈ తరం వారికి తెలిసే ఉంటుంది. అలాంటి శోభన్ బాబు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు వార్తగా మారింది. మీడియాకు దూరంగా.. వార్తల్లోకి వచ్చేందుకు ఏ మాత్రం ఇష్టపడని సెలబ్రిటీ కుటుంబాల్లో శోభన్ బాబు ఫ్యామిలీ ఒకటి. తాజాగా ఆయన మనమడు డాక్టర్ సురక్షిత్ బత్తిన సాధించిన ఘనత వార్తల్లోకి వచ్చేలా చేసింది. నిజానికి ఆయన సాధించిన ఘనత కంటే కూడా నాటి అందాల నటుడు శోభన్ బాబు మనమడు ఎలా ఉంటాడన్న ఆసక్తి ఇప్పుడు వ్యక్తమవుతోంది.
ఇంతకూ డాక్టర్ సురక్షిత్ ఏం సాధించారన్న విషయంలోకి వెళితే.. ఒక మహిళ గర్భాశయంలో భారీ కణితికి సర్జరీ చేసిన వైనం ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కనుంది. దీనికి కారణం ఆయన చేసిన సర్జరీ ఆషామాషీ కాదు. అరుదైనది కావటమే దీనికి కారణం. త్రీడీ ల్యాపరో స్కోపీ ద్వారా ఈ కణితిని తొలగించారు. తమిళనాడుకు చెందిన 44 ఏల్ల మహిళ భారీ ఫైబ్రాయిడ్ తో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న నొప్పిని తట్టుకోలేకపోతోంది.
దీంతో.. దేశంలోని వివిధ ఆసుపత్రుల్ని సంప్రదించినా.. దాన్ని తొలగించటం రిస్కుతో కూడిందని.. ఓపెన్ సర్జరీ ద్వారా తప్పించి మరో మార్గం లేదని చెప్పారు. ఈ క్రమంలో నెల క్రితం ఆమె చెన్నైలోని శోభన్ బాబు మనమడు డాక్టర్ సురక్షిత్ వద్దకు వచ్చింది. ల్యాపరోస్కోపీ ద్వారా గర్భాశయాన్ని తీసేయాలని కోరారు. దీంతో మిగిలిన వైద్యుల అభిప్రాయాల్ని తెలుసుకొని.. 8 గంటల పాటు సర్జరీ నిర్వహించారు.
త్రీడీ ల్యాపరో స్కోపీ ద్వారా సర్జరీ చేపట్టి.. ఆమెకు ఉన్న 4.5 కేజీల బారీ కణితిని.. గర్భాశయాన్ని తీసేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇంత భారీ కణితిని తొలగించిన రోజు సాయంత్రమే ఆమె ఇంటికి వెళ్లిపోవటం. వైద్య రంగంలో అత్యంత బరువైన కణితిని తొలగించిన రికార్డు ముంబయికి చెందిన వైద్యుడికి ఉంది. 2019లో 4.1 కేజీల కణితిని తొలగించగా.. తాజాగా 4.5 కేజీల కణితిని తొలగించటంతో డాక్టర్ సురక్షిత్ పేరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కనుంది. ఇక.. ఈ డాక్టర్ గారి గురించి చెప్పాల్సి వస్తే.. అత్యంత క్లిష్టమైన ఎన్నో సర్జరీల్ని నిర్వహించిన సత్తా ఆయన సొంతం.
టెడ్ ఎక్స్ స్పీకర్ గా వ్యవహరించే ఆయన సోషల్ మీడియా ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచుతుంటారు. శోభన్ బాబు మనమడన్న విషయం తెలీకుండానే ఆయన ఇన్ స్టాలో ఇప్పటికి 1.67 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. డాక్టర్ సురక్షిత్ తండ్రి అంటే శోభన్ బాబు కొడుకు డాక్టర్ శరత్ కూడా ఫేమస్సే. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. డాక్టర్ సురక్షిత్ ఇప్పటికి 10 వేల సర్జరీల్ని విజయవంతంగా పూర్తి చేశారు. తన తాత శోభన్ బాబు పేరు మీద వీకెండ్స్ లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. తాతకు తగ్గ మనమడన్న రీతిలో ఎంచుకున్న వృత్తిలోనే కాదు.. అందంలోనూ అదరగొట్టేసే డాక్టర్ సురక్షిత్ బ్యాక్ గ్రౌండ్ తెలిసిన తర్వాత ఎంతోమంది తెలుగోళ్లు ఆయనకు ఫ్యాన్స్ గా మారిపోతారని మాత్రం చెప్పక తప్పదు.
