అన్నదమ్ములు ఉన్న దమ్ములు చూపిస్తారా ?
ఈ మొత్తం పరిణామాలతో కలవరపడుతున్న ఉద్ధవ్ థాక్రే ఇపుడు తెలివిగా పావులు కదిపారు. తన తమ్ముడు కజిన్ అయిన రాజ్ థాక్రేతో అనుబంధం కలిపారు.
By: Tupaki Desk | 6 July 2025 8:00 AM ISTశివసేనను చూస్తే బెబ్బులిని చూసినట్లే. ఆ పార్టీ అధినేత బాలథాక్రే సామాన్యుడు కారు. ఏకంగా కార్టూనిస్టు నుంచి పొలిటికల్ ట్విస్టులు ఇచ్చే బిగ్ షాట్ గా ఎదిగారు. ఆయన 1966లో శివసేనను స్థాపించారు ఇప్పటికి ఆరు దశాబ్దాల చరిత్ర ఆ పార్టీకి ఉంది. ఆయన 2012లో మరణించేంతవరకు శివసేనను తన అదుపు ఆజ్ఞలలో ఉంచారు. అంతే కాదు బీజేపీతో సఖ్యత నెరిపారు. బీజేపీ పెద్దలు సైతం దేశంలో పొత్తులు ఎక్కడ ఎలా ఉన్నా మహారాష్ట్రలో మాత్రం బాల్ థాక్రేని వదిలేశేవారు. అలా అప్పర్ హ్యాండ్ శివసేనదే అయ్యేది.
అది కాస్తా కుమారుడు ఉద్ధవ్ థాక్రే నాయకత్వం అనేసరికి బీజేపీకి కొంత అలుసు వచ్చిందని అంటారు. అంతే కాదు తమదే పైచేయి అని చాటుకుంది 2014లో చూస్తే ఎక్కువ సీట్లు డిమాండ్ చేసి శివసేనను దూరం చేసింది. ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించింది. ఇక 2019లో శివసేనతో పొత్తులు ఉన్నా సీఎం గా తొలి చాన్స్ తనకే కావాలని కోరింది. దాంతో శివసేన ఏకంగా ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక 2022లో శివసేననే చీల్చేసి బీజేపీ ఎన్డీయే ప్రభుత్వం మహారాష్ట్రలో ఏర్పాటు చేసింది.
ఇక 2024లో మరోసారి ఎన్డీయే గెలిచింది. దాంతో ఉద్ధవ్ థాక్రే శివసేన చీలిపోయి ఓడిపోయి నానా ఇబ్బందులు పడుతోంది. ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న శివసేనకు ఎన్నడూ లేని కష్టాలు వచ్చి ఉనికికే ప్రమాదం దాపురిస్తోంది. దాంతో పాటు బీజేపీ దూకుడు సైతం శివసేనను చికాకు పెడుతోంది. మాస్ లీడర్ అనదగిన ఏక్ నాధ్ షిండే ఎన్డీయేలో ఉంటూ ఉద్ధవ్ థాక్రేకి పెను సవాల్ విసురుతున్నారు.
ఈ మొత్తం పరిణామాలతో కలవరపడుతున్న ఉద్ధవ్ థాక్రే ఇపుడు తెలివిగా పావులు కదిపారు. తన తమ్ముడు కజిన్ అయిన రాజ్ థాక్రేతో అనుబంధం కలిపారు. నిజానికి చూస్తే ఉద్ధవ్ థాకరేతో విభేదాల కారణంగా శివసేన పార్టీని విడిచిపెట్టిన తర్వాత రాజ్ థాకరే 2006లో నవ నిర్మాణ్ సేనను స్థాపించారు.
చిత్రమేంటి అంటే ఆయన ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ ఈ పార్టీ తరఫున గెలవలేకపోయారు. దాంతో పాటుగా ఆయన రాజకీయం కూడా అలాగే ఉంది. దాంతో ఇపుడు అన్న ఉద్ధవ్ థాక్రే పిలవగానే కలిసిపోయారు. ఈ ఇద్దరూ కలసి ముంబై వేదికగా కనిపించడం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపింది.
రెండు దశాబ్దాల క్రితం విడిపోయిన అన్న దమ్ములను కలిపింది మాత్రం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అని శివసేన నుంచి సెటైర్లు వినిపిస్తున్నాయి. ఫడ్నవీస్ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మహారాష్ట్రలో హిందీని మూడో భాషగా అమలు చేయాలని నిర్ణయించింది. అయితే దాని మీద పెద్ద ఎత్తున విపక్షాల నుంచి విమర్శలు రావటంతో త్రిభాషా విధానం అమలు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని భావిస్తోంది.
అయితే మరాఠా రాష్ట్రంలో హిందీని ఎలా రుద్దుతారు అని థాక్రే బ్రదర్స్ హూంకరించారు. అలా కొన్ని రోజుల క్రితమే తామిద్దరం ఒక్కటిగా దీనిని అడ్డుకుంటామని ప్రకటించారు. ఇపుడు ఈ ఇద్దరూ కలుసుకున్నారు. దీని మీద ఉద్ధవ్ థాక్రే సభలో మాట్లాడుతూ తాము కలిసే వచ్చామని భవిష్యత్తులోనూ కలిసే ఉంటామని చెప్పడం విశేషం.
ఎండీయే ప్రభుత్వం మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాల విజయమంటూ ముంబయిలో వాయిస్ ఆఫ్ మరాఠీ కార్యక్రమం థాక్రే బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరు కావడంతో శివసేన షైనింగ్ అన్న నినాదాలు వినిపిస్తున్నాయి. అన్న దమ్ములు ఇద్దరూ కలిస్తే మహారాష్ట్ర రాజకీయమే మారిపోతుందని శివసేనలో అంటున్నారు.
మరో వైపు చూస్తే శివసేన యూబీటీ, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఇకపై కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయా అన్న చర్చ సాగుతోంది. స్థానిక ఎన్నికలతో మొదలెట్టి సార్వత్రిక ఎన్నికల దాకా ఈ బంధాన్ని తీసుకుని పోతారని అంటున్నారు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసారు, ఉన్నదమ్ములు చూపిస్తారు అని అంటున్నారు.
