Begin typing your search above and press return to search.

అదే పని మళ్లీ చేస్తే.. ప్రపంచ పటంలో పాక్ ఉండదు.. కేంద్రమంత్రి సంచలనం

రోటీన్ కు భిన్నంగా చోటు చేసుకున్న ఈ ఉదంతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.

By:  Tupaki Desk   |   14 May 2025 10:10 AM IST
అదే పని మళ్లీ చేస్తే.. ప్రపంచ పటంలో పాక్ ఉండదు.. కేంద్రమంత్రి సంచలనం
X

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మోడీ మంత్రివర్గంలోని కేంద్ర మంత్రులు ఒక అంశాన్ని మాత్రం తూచా తప్పకుండా పాటిస్తారు. విషయం ఏదైనా.. అంశం మరేదైనా.. స్పందించే విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తారు. స్వతంత్రంగా.. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడరు. తమ మనసులోని మాటల్ని వెల్లడించేందుకు సంకోచిస్తారు.ఇందుకు గడ్కరీ ఒక్కరు మాత్రమే మినహాయింపుగా చెప్పాలి. మోడీ.. అమిత్ షా ఇద్దరిని విడదీసి చూడలేం కాబట్టి.. ఆ ఇద్దరిని వదిలేస్తే.. మిగిలిన కేంద్రమంత్రులు నోరు విప్పేందుకు.. ఆయా అంశాల మీద మాట్లాడేందుకు ఆసక్తి చూపరు.

భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మీద కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తప్పించి ఇంకెవరూ మాట్లాడటం కనిపించదు. రాజ నాధ్ సింగ్ కూడా రక్షణ మంత్రి కావటంతోనే మాట్లాడారని చెప్పాలి. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో.. పరిస్థితులు నెమ్మదిగా యాధావిధిగా మారుతున్న సందర్భంలో కేంద్ర మంత్రి ఒకరు స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది.

రోటీన్ కు భిన్నంగా చోటు చేసుకున్న ఈ ఉదంతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. తాజాగా మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘిస్తే ప్రపంచ పటంలో తన ఉనికిని కోల్పోతుందని హెచ్చరించారు. పాక్ అహంకారాన్ని ప్రపంచ దేశాల నేతలు సైతం ఎండగడుతున్నట్లుగా పేర్కొన్నారు.

ఛత్తీస్ గఢ్ లోని అంబికాపుర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మోర్ అవాస్ మోర్ అధికార్ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన.. పహల్గాం ఉగ్రఘటనకు వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ తో భారత సైన్యం పాక్ కు గట్టిగా బదులిచ్చినట్లుగా పేర్కొన్నారు. ‘‘మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచిన వాడి నట్టింటికి వెళ్లి నాశనం చేయటం దేశ శౌర్యానికి ప్రతీక. భారత్ ఎవరితోనూ గొడవలు పెట్టుకోదు. కావాలని ఎవరైనా మనపైకి వస్తే మాత్రం వారిని వదిలిపెట్టమని ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపించాం’ అని వ్యాఖ్యానించారు.