Begin typing your search above and press return to search.

హమ్మ బాలక్రిష్ణ.. మరీ ఇంత ముదురు కేసా?

ఆయన మామూలు వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నిర్మాణాలు జరగాల్సి ఉన్నా.. ఆయన సంతకం తర్వాతే వాటికి పర్మిషన్లు వస్తుంటాయి

By:  Tupaki Desk   |   28 Jan 2024 9:30 AM GMT
హమ్మ బాలక్రిష్ణ.. మరీ ఇంత ముదురు కేసా?
X

ఆయన మామూలు వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నిర్మాణాలు జరగాల్సి ఉన్నా.. ఆయన సంతకం తర్వాతే వాటికి పర్మిషన్లు వస్తుంటాయి. అంతటి కీలక పదవిలో ఉన్న ఆయన.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కారణంగా ఆయన వందల కోట్లు పోగేసిన వైనాన్ని తాజాగా గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్ గా.. రెరా ఇన్ ఛార్జి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న శివబాలక్రిష్ణ పై ఇటీవల ఏసీబీ దాడులు నిర్వహించటం.. ఏకకాలంలో పదుల ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో కళ్లు చెదిరే సంపద వెలుగు చూసింది.

ప్రభుత్వ పరంగా ఆయన ఆదాయం (వేతనాలు.. ఇతర మార్గాల ద్వారా) ఏడాదికి రూ.2.48 కోట్లు కాగా ఆయన ఆస్తులు మాత్రం అంతకు వందల రెట్లు అన్న విషయాన్ని తాజాగా బయటకు వచ్చిన అక్రమాస్తుల లెక్కలు తీసినప్పుడు అర్థమైన పరిస్థితి. ఆయన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే.. శివబాలక్రిష్ణ ఆస్తులు ఆయన ఆదాయానికి మించి 10 - 12రెట్లు ఎక్కువగా పేర్కొన్నారు. అయితే.. ఇవన్నీ కూడా ప్రభుత్వ ధరల ప్రకారం లెక్క కడితే. అదే.. మార్కెట్ ధరల ప్రకారం లెక్క చూస్తే.. మరింత భారీగా ఉంటాయని చెబుతున్నారు.

బాలక్రిష్ణ ఆస్తుల లెక్కలు చూస్తున్న వారంతా నోరెళ్లబెడుతున్నారు. హమ్మ బాలక్రిష్ణ.. నువ్వు మరీ ఇంత ముదురా? అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనకు సంబంధించిన లెక్కల్ని చూస్తే.. వేతనం.. ఇతర ఆదాయ మార్గాల ద్వారా బాలక్రిష్ణకు రూ.2.48 కోట్లు సమకూరగా.. కుటుంబ వ్యయం రూ.1.83 కోట్లుగా లెక్క వేస్తే.. ఆయన వద్ద 64.25 లక్షలు. కానీ.. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు.. బినామీల పేరుతో ఉన్న ఆస్తుల్ని చూస్తే రూ.8.26 కోట్లుగా ఏసీబీ అధికారులు తేల్చారు.

ఆయన ఆస్తుల జాబితాలో నాగర్ కర్నూల్ జిల్లా వంగనూరులో.. జనగామ జిల్లాలో జఫర్ గఢ్ మండలం ఓగులాపూర్ లో.. కొడకండ్ల మండలం ఏడునూతలలో.. పాలకుర్తి మండలం వావిలాల.. చెన్నూరులలో.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కండువాడలో.. భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపూర్.. నర్సాపూర్.. బీబీనగర్ మండలం చిన్నరేవుల పల్లెలో.. మోత్కుర్ మండలం పాలడుగులో ఆయనకు వ్యవసాయ భూములు ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటు.. పలు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ఆయన వద్ద 120 వాచ్ ల కలెక్షన్ ఉందని.. వాటి విలువే రూ.32లక్షలుగా అంచనా వేశారు. వీటిల్లో ఒక్కొక్కటి రూ.4-5 లక్షలు విలువ చేసే వాచ్ లు ఉండటం గమనార్హం.

బాలక్రిష్ణకు.. ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి దాదాపు 15 బ్యాంకు లాకర్లు ఉన్నట్లుగా గుర్తించారు. తనిఖీల వేళ.. ఇంట్లోనే రూ.84 లక్షలు దొరికిన నేపథ్యంలో.. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే మరింత భారీగా సొమ్ముల వ్యవహారం బయటకు వస్తుందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఆయన్ను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. మొత్తంగా బాలక్రిష్ణ ఆస్తులు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.