దాతృత్వంలో శివ్ నాడార్ అగ్రస్థానం
డబ్బు అనేది మనిషి జీవితానికి ప్రాణాధారం. ఆర్థిక స్థితి అనేది మనిషి గౌరవాన్ని, ప్రతిష్ఠను, ప్రభావాన్ని నిర్ణయిస్తుంది.
By: A.N.Kumar | 8 Nov 2025 2:00 AM ISTడబ్బు అనేది మనిషి జీవితానికి ప్రాణాధారం. ఆర్థిక స్థితి అనేది మనిషి గౌరవాన్ని, ప్రతిష్ఠను, ప్రభావాన్ని నిర్ణయిస్తుంది. ఎవరి వద్ద డబ్బు ఉంటుందో వారే ఈ ప్రపంచాన్ని శాసిస్తారు. కానీ అదే సమయంలో కొందరు డబ్బును సంపాదించడంలోనే కాకుండా, దానాన్ని సమాజానికి తిరిగి అందించడంలో కూడా ముందుంటారు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో భారతదేశానికి చెందిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ అగ్రగణ్యుడు.
* సూక్ష్మ స్థాయిలో మొదలై, మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన నాడార్
చిన్న పట్టణంలో పుట్టిన శివ్ నాడార్ తన జీవితాన్ని చాలా తక్కువ స్థాయిలో ప్రారంభించారు. తానెదిగిన కష్టాలను, పేదరికాన్ని, సామాన్య ప్రజల సమస్యలను దగ్గరగా చూసిన ఆయన, జీవితంలో సాధించిన విజయాలను సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగారు. చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీగా మొదలైన హెచ్‌సీఎల్ (HCL) ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఐటీ దిగ్గజంగా నిలిచింది.
నాడార్ నేతృత్వంలో హెచ్‌సీఎల్ కంపెనీ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో సేవలు అందిస్తోంది. భారతదేశం నుండి ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ, అనేక మల్టీనేషనల్ సంస్థలకు సాఫ్ట్‌వేర్ పరిష్కారాలు అందిస్తోంది. ప్రతి ఏడాది కంపెనీ స్థిరమైన వృద్ధిని సాధిస్తూ, దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.
* సంపాదనతో పాటు సేవాభావం
శివ్ నాడార్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు సమాజసేవకుడు కూడా. ఆయన సంపాదించిన సంపదలో గణనీయమైన భాగాన్ని విద్య, వైద్యం, మౌలిక వసతులు, మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధి వంటి రంగాల్లో దానం చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. శివ్ నాడార్ కుటుంబం ఈ ఏడాది మాత్రమే ₹2708 కోట్లు విరాళంగా ఇచ్చింది. గత ఐదేళ్లలో నాడార్ కుటుంబం నాలుగుసార్లు దేశంలో అత్యధిక విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఆయన తర్వాత ముకేశ్ అంబానీ ₹626 కోట్లు, బజాజ్ గ్రూప్ ₹446 కోట్లు, బిర్లా ₹440 కోట్లు, అదానీ ₹386 కోట్లు, నందన్ నీలేకణి ₹365 కోట్లు, హిందుజా కుటుంబం ₹298 కోట్లు, రోహిణి నీలేకణి ₹204 కోట్లు విరాళాలు ఇచ్చారు.
*విద్యపై ప్రత్యేక దృష్టి
శివ్ నాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలను, స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లను నడుపుతున్నారు. విద్యార్థులలో సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ శిక్షణ పూర్తి చేసిన వారికి హెచ్‌సీఎల్‌లో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నారు.
* రోషిని నాడార్ – వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న కుమార్తె
తన కుమార్తె రోషిని నాడార్ మల్హోత్రాను అధికారికంగా వారసురాలిగా ప్రకటించిన శివ్ నాడార్, ఇప్పుడు ఆమె చేతిలో కంపెనీ బాధ్యతలను అప్పగించారు. రోషిని నాడార్ ఇప్పటికే హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె నేతృత్వంలో కంపెనీ కొత్త సాంకేతికతలను స్వీకరిస్తూ, గ్లోబల్ మార్కెట్లో మరింత విస్తరిస్తోంది.
* దాతృత్వంలో దేశానికి ఆదర్శం
శివ్ నాడార్ పేరు ఇప్పుడు దాతృత్వానికి పర్యాయపదంగా మారింది. సంపాదనలో కుబేరుడిగా, దానంలో కర్ణుడిగా నిలిచిన ఆయన సమాజానికి స్ఫూర్తిదాయకుడు. ఆయన చూపించిన మార్గం, సంపాదనను సమాజాభివృద్ధికి వినియోగించడం అనే భావన కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తోంది.
