తెలంగాణ ప్రత్యేక ఉద్యమ స్ఫూర్తి ప్రదాత.. మాజీ సీఎం కన్నుమూత
అచ్చంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని పోలి ఉన్న ఈయన గురించి చెప్పాలంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రత్యక్ష స్ఫూర్తిప్రదాత.
By: Tupaki Desk | 4 Aug 2025 5:49 PM ISTమూడుసార్లు ముఖ్యమంత్రి.. ఒకసారి కేంద్ర మంత్రి.. 8సార్లు లోక్‌సభ సభ్యుడు, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడు.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని నిర్మించడమే కాదు.. సొంతంగా పార్టీ స్థాపించారు.. చివరకు రాష్ట్రాన్ని సాధించి సీఎం కూడా అయ్యారు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ నాయకుడు కన్నుమూశారు. అచ్చంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని పోలి ఉన్న ఈయన గురించి చెప్పాలంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రత్యక్ష స్ఫూర్తిప్రదాత.
అటు జార్ఖండ్ ఏర్పాటు.. ఇటు తెలంగాణ ఉద్యమం
జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) పార్టీ వ్యవస్థాపకుడు శిబు సొరెన్. 81 ఏళ్ల వయసులో ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఏమిటీ ఈయన ప్రత్యేకత అంటే బిహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం జేఎంఎం ను నెలకొల్పి ఉద్యమించారు. లాలూప్రసాద్ యాదవ్ వంటి పెద్ద నాయకుడిని ఎదిరించి కూడా ఉద్యమాన్ని కొనసాగించారు. తాను అనుకున్నది సాధించారు. 2000 సంవత్సరంలో కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్ పేయీ ప్రభుత్వం జార్ఖండ్ తో పాటు ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయడంతో జేఎంఎం, శిబు సోరెన్ లక్ష్యం నెరవేరింది.
-శిబు సోరెన్ ను స్ఫూర్తిగా తీసుకునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను స్థాపించారు. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా పలుసార్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి కూడా శిబుసోరెన్ మద్దతు పలికారు. కేసీఆర్ తో కలిసి వేదిక పంచుకున్నారు.
కాగా, శిబు సోరెన్ ను అభిమానులు గురూజీ అని ప్రేమగా పిలుచుకుంటారు. ఆయన తెలంగాణ ఉద్యమానికి కూడా పరోక్షంగా గురుగానే మిగిలారు. ప్రస్తుతం బిహార్ లో ఉన్న రామ్ గఢ్ జిల్లాలో పుట్టిన శిబుసోరెన్.. నలుగురు పిల్లలు. ముగ్గురు కుమారులు (హేమంత్, బసంత్, దుర్గా)లో హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎంగా ఉన్నారు. కుమార్తె పేరు అంజలి. శిబూ భార్య రూపీ. కుమారుల్లో దుర్గా 2009లోనే చనిపోయారు. బసంత్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
-జార్ఖండ్‌లోని గిరిజన తెగ అయిన సంతాల్ వర్గానికి చెందిన శిబు 1972లో జేఎంఎంను లెఫ్టిస్ట్ నేత ఏకే రాయ్, కుర్మి మహతో బినోద్ బిహారీ మహతోతో కలిసి 1972లో ఏర్పాటు చేశారు. 28 ఏళ్ల పోరాటం అనంతరం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.
-2005లో తొలిసారి జార్ఖండ్ సీఎం అయ్యారు. మొత్తం మూడుసార్లు సీఎంగా చేసినా ఒక్కసారీ పూర్తికాలం కొనసాగలేదు. కేసీఆర్ తో పాటే 2004లో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే, 1974 నాటి కేసు కారణంగా రాజీనామా చేశారు. తన మాజీ కార్యదర్శి హత్య కేసులో దోషిగా తేలడంతో రెండోసారి కేంద్ర మంత్రి పదవి కోల్పోయారు. దేశ చరిత్రలో ఒక హత్యకేసులో కేంద్రమంత్రి దోషిగా తేలడం అదే ప్రథమం. కాగా, ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో శిబును నిర్దోషిగా తేల్చింది.
