Begin typing your search above and press return to search.

ఆమె ఏపీకి పరిమితం.. ఆయన ప్రయత్నం సక్సెస్

ఇక్కడ ఇంకో విషయం ఏమంటే..కాంగ్రెస్ కు ముప్పుగా భావించిన ఓ నాయకురాలిని విజయవంతంగా తెలంగాణ తెరపై నుంచి తప్పించడం.

By:  Tupaki Desk   |   8 Jan 2024 10:55 AM GMT
ఆమె ఏపీకి పరిమితం.. ఆయన ప్రయత్నం సక్సెస్
X

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి ఎన్నికలు పెద్ద సంచలనం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రెండేళ్ల కిందట ఎవరికీ ఆలోచన కూడా లేదు. ఏడాది కిందట తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎవరికైనా చెప్పినా సరేలే చూద్దాం అనేవారు. ఆరు నెలల క్రితం అయితే.. ఔనా అని అనేవారు. ఇప్పుడు మాత్రం అనూహ్యం జరిగిందని అంటున్నారు. దీనంతటికీ కాంగ్రెస్ పట్టుదల, బీఆర్ఎస్ చేజేతులా చేసుకున్నది, బీజేపీ లోపాయికారీ ఒప్పందం ఫలితమే అని చెప్పక్కర్లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే..కాంగ్రెస్ కు ముప్పుగా భావించిన ఓ నాయకురాలిని విజయవంతంగా తెలంగాణ తెరపై నుంచి తప్పించడం.

ఆమె ఉండి ఉంటే..

2021 జూలై 7న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరున వైస్సార్టీపీ పేరిట పార్టీని స్థాపించి హడావుడి చేశారు ఆయన కుమార్తె వైస్ షర్మిల. తెలంగాణలో పాదయాత్ర, మంగళవారం నిరుద్యోగ దీక్ష తదితరాలు చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. కానీ.. మొన్నటి ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్సార్టీపీ తెలంగాణలో పోటీనే చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. స్వయంగా పాలేరు నుంచి పోటీ చేస్తానన్న షర్మిల చివరకు ఆ ప్రయత్నం కూడా మానుకున్నారు. గత వారం తన పార్టీని ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో కలిపారు. వాస్తవానికి తెలంగాణ కంటే ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ ప్రభావం తెలంగాణపై పడింది. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని మార్చి బీఆర్ఎస్ కు మేలు చేయాలని చూసింది. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నాయకుడితో మంచి పరిచయం ఉన్న షర్మిల.. క్రమంగా కాంగ్రెస్ వైపు మొగ్గడం ప్రారంభించారు. తెలంగాణలో ఆమె పార్టీ పోటీ చేయకుండా ఉండిపోయింది. ఒకవేళ షర్మిల గనుక రంగంలో ఉండి ఉంటే.. రాజకీయ పరిస్థితులు వేరేగా ఉండేవి. ఆమెను బూచిగా చూపించి బీఆర్ఎస్ పెద్దలు తెలంగాణ వాదాన్ని ప్రస్తావించేవారు. ప్రజలను భావోద్వేగ పరంగా నిర్ణయం తీసుకునేలా చేసేవారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మహా కూటమి అంటూ కాంగ్రెస్, వామపక్షాలతో తెలంగాణలో పోటీచేస్తే ఇదే జరిగింది. కాగా.. ఇటీవలి ఎన్నికల్లోనూ షర్మిల రూపంలో బీఆర్ఎస్ కు ఆ అవకాశం దక్కింది.

అప్పడు.. ఆ తర్వాత..

తెలంగాణలో షర్మిల పోటీని తప్పించడంలో ప్రస్తుత సీఎం, టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ప్రయత్నం అందరికీ తెలిసిందే. తద్వారా కాంగ్రెస్ గెలుపునకు రేవంత్ బాటలు వేశారు. ఇక ఆమె పేరు ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ గా వినిపిస్తోంది. రెండ్రోజుల కిందటి ఇంటర్వ్యూలోనూ రేవంత్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అంటే.. ఇకపై తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పాత్ర ఉండదు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక సీఎం రేవంత్ వ్యూహ చతురత కనిపిస్తోందనడంలో సందేహం లేదు. షర్మిల తెలంగాణలో ఉంటే మున్ముందు ఆయనకు, పార్టీకి రెండింటికీ నష్టమే. దీనిని గ్రహించి ఆమెను ఏపీకి పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు. వాస్తవానికి ఏపీ నేపథ్యం ఉన్న షర్మిల ఏపీలో పార్టీ అవసరాల రీత్యా అక్కడే తేల్చుకోవడం మేలనేది మెజార్టీ తెలంగాణవాదుల అభిప్రాయం. దానికితగ్గట్లే ఇప్పుడు జరిగింది.