Begin typing your search above and press return to search.

బంగ్లా గడ్డ మీదే తేల్చుకుంటానంటున్న షేక్ హసీనా

శాంతిభద్రతలతో చల్లగా ఉన్న బంగ్లాదేశ్ ని ఉగ్ర దేశంగా మార్చారని ఆ దేశ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్‌ పైన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా నిప్పులు చెరిగారు.

By:  Tupaki Desk   |   9 April 2025 3:49 AM
Sheikh Hasina Fires Back at Bangladesh Interim Rule
X

శాంతిభద్రతలతో చల్లగా ఉన్న బంగ్లాదేశ్ ని ఉగ్ర దేశంగా మార్చారని ఆ దేశ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్‌ పైన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితి తనను కలచివేస్తోందని ఆమె అన్నారు. ఇటీవల బ్యాంకాక్ లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్‌ షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించమని కోరారు.

అయితే దాని మీద భారత్ ఏ నిర్ణయమూ చెప్పలేదు. ఆమె చాలా కాలంగా భారత్ లోనే ఉంటున్న్నారు. ఈ దేశంలో ఆమె ఆశ్రయం పొందుతున్నారు గత ఏడాది ఆగస్టు సమయంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని సాయుధ నిరసనల మధ్య కూలదోసి గద్దెనెక్కిన వారు మహమ్మద్ యూనస్‌. ఆయనను పరోక్షంగా ముందు పెట్టి పాలన చేస్తోంది అక్కడి సైనిక వ్యవస్థ అని అంటున్నారు.

ఇక ఆ సైనిక వ్యవస్థకు వెన్నూ దన్నుగా ఒకనాటి దాయాది పాకిస్థాన్ ఉందని అంటున్నారు. వీరికి చైనా సాయం తోడు అయింది అని కూడా ఉంది ఇటీవలనే చైనా పర్యతనకు వెళ్ళిన మహమ్మద్ యూనస్‌ అక్కడ భారత వ్యతిరేక గళం వినిపించి వచ్చారు. ఆ మీదట మోడీతో భేటీలోనూ తన తీరుని అదే విధంగా చాటుకున్నారు. పొరుగు దేశంగా బంగ్లాతో మంచి సంబంధాలు భారత్ ఆశిస్తూంటే భారత్ ని ఇబ్బంది పెట్టేలా పాక్ చైనాలతో చెలిమి చేస్తూ బంగ్లా తన కొత్త పోకడలను చూపిస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్ లో ఉన్న షేక్ హసీనా చాలా కాలం తరువాత స్పందించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా తన పార్టీ అయిన అవామీ లీగ్ కార్యకర్తలతో మాట్లాడారు. వారిని అక్కడ తాత్కాలిక ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు హింసను చూసిన ఆమె మహమ్మద్ యూనస్‌ ప్రభుత్వం మీద ఘాటైన విమర్శలు చేశారు. ఆయన బంగ్లాని ఉగ్రవాద దేశంగా మార్చేశారు అని తీవ్ర విమర్శలు చేశారు.

అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి ఆ ధనంతో విదేశాలలో విలాసవంతమైన జీవితాన్ని గడపిన మహమ్మద్ యూనస్‌ కి ప్రజల పట్ల ప్రేమ ఎందుకు ఉంటుందని ఆమె ప్రశ్నించారు. బంగ్లాదేశ్ వల్ల ఎంతో ప్రయోజనం పొందిన ఆయన దేశానికి ప్రజలకు తిరిగి చేసింది ఏమీ లేదని ఆమె విమర్శించారు

ఈ రోజున బంగ్లాదేశ్ అంటే అత్యాచారాలు దొంగతనాలు లూటీలకు పేరుగా మారిందని అన్నారు నేరాలకు ఉగ్ర మూలాలకు బంగ్లాదేశ్ ని ఆలవాలంగా మార్చేశారు అని అన్నారు. తాను బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు ముజఫర్ రెహమాన్ బిడ్డను అని ఆమె చెప్పారు. తన తండ్రితో పాటు మొత్తం కుటుంబాన్ని చంపేసినా తాను ఇంకా బతికి ఉన్నానూ అంటే తన వల్లనే బంగ్లా ప్రజలకు మంచి జరగాలని ఆ దేవుడు కోరుకుని ఉంటాడని ఆమె అన్నారు.

తనను పదే పదే ఆ దేవుడు రక్షిస్తున్నాడు అంటే దేశ ప్రజలకు మేలు చేయమనే అందులో పరమార్ధం అని అన్నారు. ఇక షేక్ హసీనాను తమకు అప్పగించమని భారత్ ని మహమ్మద్ యూనస్‌ కోరిన దానికి స్పందన అన్నట్లుగా షేక్ హసీనా ఘాటైన బదులు ఇచ్చారు. తాను తప్పకుండా బంగ్లాదేశ్ వస్తానని ఆ దేశానికి మంచి చేసేందుకు మంచి రోజుల కోసం వస్తాను అని అన్నారు. మళ్ళీ తమ ప్రభుత్వం వస్తుందని అందరికీ న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు కూడా ధైర్యగా ఉండమని ఆమె చెప్పారు.

ఇక చూస్తే కనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంగ్లా ప్రస్తుత పాలకుడు మహమ్మద్ యూనస్‌ తీరుకు వ్యతిరేకమని చెబుతున్నారు అలాగే చైనాతో అంటకాగడం కూడా పెద్దన్నకు కోపం తెప్పిచేదే. ఆయన షేక్ హసీనా వైపు ఉంటారని అంతా అంటున్నారు. ట్రంప్ సరైన సమయం చూసుకుని బంగ్లాకు షాక్ ఇస్తారని అపుడే షేక్ హసీనా అక్కడ అడుగుపెడతారని అంటున్నారు. ఏది ఏమైనా భారత్ చేత ఏర్పాటు అయిన బంగ్లా ఈ రోజులు విషం కక్కుతూ కోరలు చాచడం మాత్రం సహించలేని విషయమే అని అంటున్నారు. బంగ్లా మళ్ళీ మంచి నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించాలని అంతా కోరుకుంటున్నారు.