గొర్రెల స్కాంపై ఈడీ సోదాలు : బీఆర్ఎస్ లో టెన్షన్.. టెన్షన్..
తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న గొర్రెల స్కాంపై ఈడీ దర్యాప్తు ముమ్మరమైంది.
By: Tupaki Desk | 30 July 2025 8:26 PM ISTతెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న గొర్రెల స్కాంపై ఈడీ దర్యాప్తు ముమ్మరమైంది. బుధవారం హైదరాబాద్ నగరంలో సుమారు పది చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లు మీడియా కథనాలు ప్రసారమవుతున్నాయి. సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సిబ్బంది ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, గొర్రెలను పంపిణీ పథకం ప్రవేశపెట్టారు. అయితే గొర్రెలను పంపిణీ చేయకుండానే ప్రజా ధనాన్ని దారి మళ్లించారని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏసీబీ విచారణ చేపట్టారు. సుమారు రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని ఏసీబీ తేల్చడంతో ఈడీ రంగంలోకి దిగింది.
రూ.700 కోట్ల స్కాం
ఏసీబీ కేసు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈడీ హైదరాబాద్ లో చేపట్టిన సోదాలతో కలకలం చెలరేగింది. గత ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరిపిన వ్యక్తులు, సంస్థల ఇళ్లు, కార్యాలయాల్లోనే ఈ సోదాలు జరిగాయి. కోట్ల రూపాయల డబ్బు, విలువైన పత్రాలు, కీలక సాక్ష్యాధారాలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతుండటం ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైందని అంటున్నారు. సుమారు రూ.700 కోట్లు చేతులు మారాయని ఏసీబీ నిర్ధారించడం, పెద్ద ఎత్తున డబ్బులు మారిందన్న సమాచారం, ఇతర రాష్ట్రాలకూ లింకులు ఉండటంతో ఈడీ దర్యాప్తు టెన్షన్ పుట్టిస్తోంది.
రూ.4 వేల కోట్లతో అమలు
2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా వేల మంది లబ్దిదారులకు రూ.4 వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేశామని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. పథకం ప్రారంభించిన తొలి నాళ్ల నుంచే కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించారని, మధ్యవర్తులతో కలిసి డబ్బు దారి మళ్లించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
బినామీ పేర్లతో కొట్టేశారు?
అసలు లబ్దిదారులకు నిధులు అందకుండా బినామీ ఖాతాల్లోకి ప్రజాధనం మళ్లించినట్లు ఏసీబీ గుర్తించిందని చెబుతున్నారు. కొంత మంది విక్రేతలకు డబ్బు ముట్టినట్లు రికార్డుల్లో చూపి ఆ మొత్తాన్ని నేతలు, అధికారులు వాటాలు వేసుకుని పంచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్కాంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతకు సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన మంత్రిగా పనిచేయగా, ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన ఓ అధికారి ఇంట్లో తనిఖీలు చేయడం, పెద్ద ఎత్తున నగదు గుర్తించినట్లు కథనాలు రావడంతో కలకలం రేగుతోంది.
