Begin typing your search above and press return to search.

ఇంద్రాణీ ముఖర్జీ డాక్యుమెంటరీ... నెట్ ఫ్లిక్స్ కు కోర్టు కీలక ఆదేశాలు!

ఇటీవల కాలంలో పలు సినిమాల విడుదలకు సంబంధించిన విషయాలు కోర్టు మెట్లెక్కుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Feb 2024 11:48 AM GMT
ఇంద్రాణీ ముఖర్జీ డాక్యుమెంటరీ... నెట్ ఫ్లిక్స్ కు కోర్టు కీలక ఆదేశాలు!
X

ఇటీవల కాలంలో పలు సినిమాల విడుదలకు సంబంధించిన విషయాలు కోర్టు మెట్లెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జీపై రూపొందిన ఓ డాక్యుమెంటరీ వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ డాక్యుమెంటరీ విడుదలపై బాంబే హైకోర్టు నెట్ ఫ్లిక్స్ కు కీలక ఆదేశాలు జారీచేసింది.

అవును... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన "ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ - బరీడ్ ట్రూత్" (సమాధి చేసిన సత్యం) డాక్యుమెంటరీ విడుదలకు బాంబే హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 29 వరకు ఆ డాక్యుమెంటరీని విడుదల చేయొద్దని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ ఫ్లిక్స్‌ ను ఆదేశించింది. ఈలోపు ఈ డాక్యుమెంటరీని కోర్టు, సీబీఐ ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాలని సూచించింది.

వాస్తవానికి ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 23న నెట్‌ ఫ్లిక్స్‌ లో విడుదలకు సిద్ధమైంది. అయితే... ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తయ్యేవరకు విడుదల కాకుండా స్టే ఇవ్వాలని బాంబే హైకోర్టును కోరుతూ సీబీఐ ఆశ్రయించింది. దీంతో ఈ పిటిషన్ పై విచారించిన డివిజన్‌ బెంచ్‌... దర్యాప్తు సంస్థ (సీబీఐ) తోపాటు న్యాయస్థానం (బాంబే హైకోర్టు) వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని నెట్‌ ఫ్లిక్స్‌ ను ఆదేశించింది. దీనికి సదరు ఓటీటీ సంస్థ అంగీకరించింది.

కాగా... 2012లో జరిగిన తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఈ కేసులో అరెస్టైన ఆమె సుమారు ఆరున్నరేళ్లపాటు జైల్లో ఉండి.. 2022 లో బెయిల్‌ పై విడుదలయ్యారు. ఈ వ్యవహారంపై ఇటీవల ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ రూపొందింది. ఈ క్రమంలో కొనసాగుతున్న దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఈ సిరీస్‌ విడుదల చేయొద్దని సీబీఐ వాదిస్తోంది.