Begin typing your search above and press return to search.

ఎన్డీయే నిర్ణయంపై కాంగ్రెస్ నేత ప్రశంసలు.. నెట్టింట శశిథరూర్ 2.0!

ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాలను ఇప్పటికే శశిథరూర్ కొనియాడుతున్నారంటు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న వేళ.. ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కొనియాడారు.

By:  Tupaki Desk   |   30 May 2025 7:00 PM IST
ఎన్డీయే నిర్ణయంపై కాంగ్రెస్ నేత ప్రశంసలు.. నెట్టింట శశిథరూర్ 2.0!
X

ప్రస్తుతం బీజేపీ నిర్ణయాలను కొనియాడుతూ, ప్రపంచ వేదికలపై మోడీ సర్కార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విషయం హాట్ టాపిక్ గా మారిన వేళ... జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దుపై కితాబిచ్చారు మరో కాంగ్రెస్ నేత. దీంతో.. ఇప్పుడు ఈయన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాలను ఇప్పటికే శశిథరూర్ కొనియాడుతున్నారంటు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న వేళ.. ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కొనియాడారు. ఈ నిర్ణయం జమ్మూకశ్మీర్ లో ఎంతోకాలంగా ఉన్న వేర్పాటువాద సమస్యకు ముగింపు పలికిందని అన్నారు.

ఈ సందర్భంగా... కశ్మీర్ కు చాలాకాలం ఒక పెద్ద సమస్య ఉండేదని.. ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా అది దేశంలోని మిగిలిన ప్రాంతాలతో వేరు అనే భావన కలిగించేదని.. అయితే, ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఆ వేరు అనే భావన అంతమైందని అన్నారు. ఇండోనేషియాలో థింక్ ట్యాంక్స్, విద్యాసంస్థల సభ్యులతో కలిసిన సమావేశంలో ఆయన ప్రసగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్ పై ఏర్పడిన అఖిలపక్ష బృందంలోని జనతాదల్ (యునైటెడ్) ఎంపీ సంజయ్ కుమార్ ఝూ నేతృత్వంలో పర్యటిస్తున్న సల్మాన్ ఖుర్షీద్.. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూకశ్మీర్ లో వాతావారణం పురోగతిని సాధించిందని.. తదుపరి జరిగిన ఎన్నికల్లో 65% ఓటర్లు పాల్గొన్నారని.. ఫలితంగా, కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు.

కాగా... ఉగ్రవాదంపై పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోడీ సర్కార్ పై శశిథరూర్ అనుకూల వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇవి కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఈ సమయంలో ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేసియా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో పర్యటిస్తోన్న బృందంలో సభ్యుడిగా ఉన్న సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇప్పుడు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను కొనియాడటం సంచలనంగా మారింది. ఈయనను శశిథరూర్ 2.0 అంటూ నెట్టింట కామెంట్లు దర్శనమిస్తున్నాయి.