Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లోనే చర్చిస్తా.. బీజేపీలో చేరే ఉద్దేశంపై ఓపెన్ అయిన శశిథూర్

కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ సీనియర్ ఎంపీ డాక్టర్ శశి థరూర్ మరోసారి వార్తల్లోకెక్కారు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 2:00 AM IST
కాంగ్రెస్ లోనే చర్చిస్తా.. బీజేపీలో చేరే ఉద్దేశంపై ఓపెన్ అయిన శశిథూర్
X

కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ సీనియర్ ఎంపీ డాక్టర్ శశి థరూర్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమెరికా ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహించనున్నట్టు ప్రకటించడంతో, కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయనకు విభేదాలు ఉండొచ్చన్న ఊహాగానాలు రాజుకున్నాయి. ఇదే సమయంలో బీజేపీ నేతలపై, ప్రధాని నరేంద్ర మోడీపై థరూర్ ప్రశంసలు గుప్పించడంతో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారనే విమర్శలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో తాజాగా శశి థరూర్ స్పందించారు. "నాకు కాంగ్రెస్ పార్టీపై నిబద్ధత ఉంది. గత 16 ఏళ్లుగా ఈ పార్టీలోనే పని చేస్తున్నాను. కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అలాంటి అంశాలను పార్టీలోనే చర్చిస్తాను. ప్రజల ముందు వాటిని ఉంచాలనుకోవడం లేదు. దేశ ప్రయోజనాల విషయమై నేను ఎల్లప్పుడూ కేంద్రానికి సహకరిస్తాను. ఈ విషయంలో రాజీ లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

తనను కేంద్రం ఎంపీల ప్రతినిధిగా ఎంపిక చేయడంపై మాట్లాడుతూ, "ప్రతినిధి బృందం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీతో మాత్రమే చర్చ జరిగింది. ఇది రాజకీయ అంశం కాదు. దేశ ప్రయోజనం కోసం నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని పేర్కొన్నారు.

కాగా, ఇటీవల థరూర్ ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులు జైశంకర్, అశ్వినీ వైష్ణవ్‌లను ప్రశంసించారు. వీరిని ఆయన సన్నిహిత మిత్రులుగా పేర్కొనడం, ప్రధాని పాలనపై ప్రశంసలు కురిపించడం బీజేపీ చేరిక ఊహాగానాలకు బలం చేకూర్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ వాదనలకు పదును పెట్టేలా థరూర్ తాజాగా స్పందించారు. తన అభిప్రాయ భేదాలను కాంగ్రెస్ లోనే చర్చిస్తానని, బీజేపీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పినట్టయింది. అయినా రాజకీయాల్లో ఎప్పుడూ ఊహాగానాలకు అంతు ఉండదన్నది మరోసారి స్పష్టమైంది.

శశి థరూర్ కాంగ్రెస్ లో కీలక నేత. కానీ బీజేపీతో అనుబంధం అంశంపై అంతర్గత సందేహాలు కొనసాగే సూచనలు ఉన్నాయి. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, భవిష్యత్తు కార్యాచరణ కూడా అదే అని స్పష్టం చేసినప్పటికీ... ఆయన అడుగులు ఏమైపోతాయో చూడాల్సిందే.