Begin typing your search above and press return to search.

ట్రంప్ తీరుపై కాంగ్రెస్ మేధావి కీలక వ్యాఖ్యలు

ట్రంప్ నిర్ణయాల కారణంగా ప్రపంచం ఇబ్బంది పడుతోందన్న ఆయన.. భారత్ తో సహా పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   8 April 2025 10:07 AM IST
Shashi Tharoor Slams Trump Tariffs
X

రాజకీయ నాయకులు రెండు రకాలు. ఒకరు బుద్ధిబలంతో అందరి మనసుల్ని దోచుకుంటారు. మరికొందరు డబ్బు బలం.. నేరపూరిత రాజకీయాలతో తమదైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటారు. సమకాలీన రాజకీయాల్లో మొదటి రకం రాజకీయనేతలు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఇందులోనూ మేధావి బ్రాండెడ్ నేతలు చాలా చాలా తక్కువ. విషయం ఏదైనా తమ అభిప్రాయాల్ని కుండబద్ధలు కొట్టేస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్. మేధావి పొలిటిషిన్ గా గుర్తింపు పొందిన ఆయన.. అప్పుడప్పుడు సొంత పార్టీ మీదా విమర్శలు చేసేందుకు వెనుకాడరు. సరికొత్త ఇంగ్లిషు పదాలతో అందరి మెదళ్లకు మేత పెట్టే ఆయన.. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల ఎఫెక్టు ఎలా ఉంటుందన్న అంశంపై స్పందించారు.

ట్రంప్ నిర్ణయాల కారణంగా ప్రపంచం ఇబ్బంది పడుతోందన్న ఆయన.. భారత్ తో సహా పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 8 - 9 ( అంటే ఈ రోజు.. రేపు) తేదీల్లో ఏఐసీసీ సమావేశాల్లో పాల్గొనేందుకు అహ్మదాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.రెండు రోజుల పాటు సాగనున్న కాంగ్రెస్ కీలక సమావేశాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరై.. పార్టీ విధివిధానాలపై చర్చలు.. పార్టీ వ్యవహారాలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరపనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అహ్మదాబాద్ కు వచ్చిన శశిధరూర్ ట్రంప్ విధానాలపై స్పందించారు. ట్రంప్ ప్రకటించిన టారిఫ్ లు అన్ని దేశాలకూ ప్రతికూల వార్తేనని చెబుతూ.. ఆ టారిఫ్ ల వెనుక లాజిక్ ఎవరికీ అర్థం కాదన్నారు. ‘అమెరికాతో ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత్ కు ఉపశమనం లభిస్తుందని నేను ఆశిస్తున్నా. ఈ ప్రభావం అన్ని దేశాల మీదా ఉంది. భారత్ కూడా వీటిని భరించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో భగవంతుడికే తెలియాలి’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ట్రంప్ ప్రకటించిన ప్రతీకార టారిఫ్ లు గడిచిన ఐదు రోజుల్లో ప్రపంచం ఎంతో ఇబ్బందికి గురైందని పేర్కొన్నారు. నిజానికి శశిథరూర్ లాంటి వారు సైతం ట్రంప్ సుంకాల ఎఫెక్టు ఎంత ఉంటుందన్నది అంచనా వేయలేకపోవటం గమనార్హం.