Begin typing your search above and press return to search.

ఎమర్జెన్సీ ఓ చీకటి చాప్టర్ కాదు.. అంతకుమించి.. థరూర్ సంచలన వ్యాసం

ఇదంతా జరిగి 50 ఏళ్లయింది. అందరూ మర్చిపోతున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అయిన శశిథరూర్ మాత్రం వివాదాస్పదం చేశారు.

By:  Tupaki Desk   |   10 July 2025 4:00 PM IST
ఎమర్జెన్సీ ఓ చీకటి చాప్టర్ కాదు.. అంతకుమించి.. థరూర్ సంచలన వ్యాసం
X

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత చరిత్రలో 1975 జూన్ 25న ఓ సంచలన పరిణామం.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ఓ మాయని మచ్చ. పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉన్నా.. ఇందిరాగాంధీ వంటి బలమైన నాయకురాలు అలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత జరిగినదంతా చరిత్రే. ఇదంతా జరిగి 50 ఏళ్లయింది. అందరూ మర్చిపోతున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అయిన శశిథరూర్ మాత్రం వివాదాస్పదం చేశారు.

ఎమర్జెన్సీని ప్రధాని మోదీతో పాటు బీజేపీ నాయకులు తరచూ కాంగ్రెస్ పై తమ విమర్శలకు ఆయుధంగా ఎంచుకుంటారు. నాడు ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ప్రజల హక్కులను కాలరాశారని ఆరోపిస్తుంటారు. దీన్ని బలపరిచేలా థరూర్ తాజాగా ఓ మలయాళ మీడియాకు రాసిన వ్యాసం దుమారం రేపుతోంది.

దేశ చరిత్రలో ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగానే చూడలేమని.. థరూర్ తన వ్యాసంలో రాసుకొచ్చారు. దాన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘‘ఇందిరా కుమారుడు సంజయ్ గాంధీ నాడు బలవంతంగా కుటుంబ నియంత్రణ సర్జరీలు చేయించారు. వాటిని ఎవరూ మర్చిపోలేరు. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీ వరకు ఎమర్జెన్సీ పేరిట దేశంలో డిసిప్లిన్ కోసం చేపట్టిన చర్యలు నోటితో చెప్పలేని క్రూరత్వానికి దారితీశాయి. శిబిరాలు పెట్టి మరీ ఊళ్లలో సంజయ్ గాంధీ బలవంతకు శస్త్రచికిత్సలు చేయించారు. ఏకపక్ష లక్ష్యాలను చేరేందుకు హింసను ఆయుధంగా చేసుకున్నారు. ఓ అదుపు లేని శక్తి (సంజయ్ గాంధీ) నిరంకుశత్వానికి దారితీసింది‘‘ అని థరూర్ విమర్శల వర్షం కురిపించారు. పేదలు నివాసం ఉండే ఢిల్లీలోని మురికివాడలను నిర్దాక్షిణ్యంగా తొలగించారని.. ఎంత తప్పు అని ఒప్పుకొన్నా.. ఆ రోజులను ఎవరూ మర్చిపోలేరు అంటూ కూడా తప్పుబట్టారు.

మోదీకి పరోక్ష ప్రశంసలు...

ఎమర్జెన్సీని పూర్తిగా తప్పుబట్టిన థరూర్.. ఇప్పుడు భారత దేశం స్వావలంబనతో ముందుకెళ్తోందని పరోక్షంగా మోదీ పాలనను పొగిడారు. బలమైన ప్రజాస్వామ్యంలో ఉన్నామని కొనియాడారు. ఎమర్జెన్సీలో పేదల సంక్షేమం గురించి పట్టించుకోలేదని.. ప్రజల ప్రాథమిక హక్కలను అణగదొక్కారని.. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకున్నారని, ఇదంతా దేశ రాజకీయ చరిత్రలో మాయని మచ్చ అని థరూర్ తీవ్రస్థాయిలో రాసుకొచ్చారు. ఆ గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని బలపర్చుకోవాలని కోరారు.

అంతర్గత గందరగోళం, బయటి శక్తుల ముప్పును తప్పించుకోవడానికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నిర్ణయం తీసున్నా.. అది ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు దారి తీసిందని తప్పుబట్టారు. న్యాయ వ్యవస్థ కూడా ఒత్తిడికి లోనై హెబియస్ కార్పస్ హక్కులనూ నిలిపివేసిందని పేర్కొన్నారు. అపరిమిత అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చో ఈ చర్యలు నిరూపించాయని థరూర్ రాసుకొచ్చారు.