Begin typing your search above and press return to search.

'రాంబదులు ఉంటాయి జాగ్రత్త'... శశిథరూర్ ని వెంటాడుతున్న కాంగ్రెస్!

ఈ సందర్భంగా... 'ఎగరడానికి ఎవరి అనుమతి అడగకు. రెక్కలు నీవి.. ఆకాశం ఎవరి సొంతం కాదు' అనే సందేశాన్ని పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Jun 2025 8:15 AM IST
రాంబదులు ఉంటాయి జాగ్రత్త... శశిథరూర్  ని వెంటాడుతున్న కాంగ్రెస్!
X

కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ ఎంపీ శశి థరూర్ కు మధ్య గ్యాప్ రోజు రోజుకీ పెరుగుతున్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే! అనధికారికంగా ఆయన బీజేపీ నేత అయిపోయారని కాంగ్రెస్ చెబుతుంటే.. పక్షిగా స్వేచ్ఛగా ఎగరనివ్వాలన్నట్లుగా థరూర్ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో థరూర్ ‘ఎక్స్’ పోస్టులకు కాంగ్రెస్ నేతల నుంచి వరుస సెటైర్లు పడుతున్నాయి.

అవును... గత కొన్ని రోజులుగా శశిథరూర్ కి కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... పార్టీలో తనపై వస్తున్న విమర్శలు, కండిషన్స్ ని ఉద్దేశిస్తూ అన్నట్లు థరూర్‌ నిన్న 'పక్షిని స్వేచ్ఛగా ఎగరనివ్వాలి' అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. దీంతో.. 'రాబందులు ఉంటాయి జాగ్రత్త' అంటు కాంగ్రెస్ నుంచి వచ్చిన హెచ్చరిక వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... గత కొంతకాలంగా ప్రధాని మోడీతో థరూర్ కి కెమిస్ట్రీ బాగా కుదురుతుందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీయే తనకు తాను పంపేవరకూ థరూర్ చూస్తున్నారనే చర్చా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోడీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ఓ కాలమ్‌ రాశారు.

దీనికి స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు! ఇందులో భాగంగా... 'మాకు దేశమే తొలి ప్రాధాన్యం కానీ.. కొందరికి మాత్రం మోడీనే ప్రాధాన్యం' అంటూ విమర్శలు గుప్పించారు! దీనికి కౌంటర్ గా ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు థరూర్. అందులో ఓ పక్షి ఫోటోను షేర్ చేశారు.

ఈ సందర్భంగా... 'ఎగరడానికి ఎవరి అనుమతి అడగకు. రెక్కలు నీవి.. ఆకాశం ఎవరి సొంతం కాదు' అనే సందేశాన్ని పంచుకున్నారు. దీంతో... మల్లికార్జున్ ఖర్గే తాజా వ్యాఖ్యలతో పాటు పార్టీలో తనపై వస్తోన్న విమర్శలకు బదులుగానే ఈ పోస్ట్‌ చేశారని ప్రచారం మొదలైంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనికి కౌంటర్ పోస్టులతో పలువురు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు!

ఈ నేపథ్యంలో... 'ఎగరడానికి అనుమతి అడగొద్దు. పక్షులు రెక్కలు విరుచుకునేందుకు ఎవరి ఆమోదం అక్కర్లేదు. కానీ, స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని నిశితంగా గమనిస్తూ ఉండాల్సిందే. గద్దలు, రాబందులు ఎల్లప్పుడూ వేటాడుతూనే ఉంటాయి. స్వేచ్ఛ ఎప్పటికీ ఉచితంగా రాదు.. ముఖ్యంగా వేటగాళ్ళు దేశభక్తిని ఈకలుగా ధరించినప్పుడు' అనే పోస్ట్ తాజాగా ఎక్స్ లో దర్శనమిచ్చింది.

ఈ పోస్ట్ ను కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ తన 'ఎక్స్‌' ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. దీంతో.. శశిథరూర్ పోస్ట్ ను ఉద్దేశించే ఠాగూర్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో... బీజేపీ నేతలతో సాన్నిహిత్యాన్ని ఉద్దేశించి తన సహచరుడికి ఇలా చురకలతో కూడిన సూచనలు ఇచ్చి ఉంటారని అంటున్నారు.