Begin typing your search above and press return to search.

షర్మిల పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదా...!?

ఆయన అన్నారని కాదు కానీ షర్మిల విషయం తీసుకుంటే ఆమె క్రెడిట్ తనకంటూ తీసుకోవడానికి ఏమి ఉంది అన్నది కూడా ప్రశ్నగా వస్తుంది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 6:26 AM GMT
షర్మిల పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదా...!?
X

వైఎస్ షర్మిల అంటే ఎవరు అన్న దానికి వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక చిరునామా చెప్పారు. ఆమె వైఎస్సార్ కుమార్తె. ఏపీ సీఎం జగన్ సోదరి మాత్రమే అని. ఆ గుర్తింపుతోనే కాంగ్రెస్ ఆమెకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిందని ఆయన అన్నారు. ఆయన అన్నారని కాదు కానీ షర్మిల విషయం తీసుకుంటే ఆమె క్రెడిట్ తనకంటూ తీసుకోవడానికి ఏమి ఉంది అన్నది కూడా ప్రశ్నగా వస్తుంది.

ఆమె జగన్ కోసం పాదయాత్ర చేశారు. జగన్న బాణాన్ని అని చెప్పుకునే ఆమె చేశారు. అలా ఆమె వైసీపీలో ఒక ప్రధాన స్టార్ కాంపెనియర్ గా ఉన్నారు అనే అంటున్నారు. ఆమె సొంతంగా గెలిచి చూపించిన సందర్భం ఉంటే ఆమెకు గుర్తింపు కచ్చితంగా ఉండేది. కానీ ఆమె పట్టుదలగా వెళ్ళి తెలంగాణాలో పార్టీ పెట్టారు. వైఎస్సార్టీపీ అని దానికి సెంటిమెంట్ తో పేరు పెట్టారు.

తన తండ్రి సేవలు ఆయన పాలన తెలంగాణాలో లో కూడా ఉందని, అందువల్ల తన తండ్రి పాలన తెస్తాను అంటూ మూడు వేలకు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మొత్తం 119 సీట్లకు అభ్యర్ధులను పెడతాను అన్నారు. ఆఖరుకు తాను కూడా పాలేరులో పోటీ చేయకుండా చాప చుట్టేశారు. అయితే గెలుపోటములు తరువాత షర్మిల పోటీ చేసి ఉంటే ఆమె స్టామినా ఎంతో తెలిసేది అని అంటున్న వారూ ఉన్నారు.

మరి షర్మిలను ఎందుకు కాంగ్రెస్ ఏపీలో తీసుకుని వచ్చింది అంటే ఆమె వల్ల వైసీపీ ఓట్లలో చీలిక కోసం అన్నది రాజకీయం తెలిసిన వారికి అందరికీ అర్ధం అయ్యే విషయమే. షర్మిల ఏపీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్. మరో రెండు నెలలలో ఎన్నికలు ఉన్నాయి. షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న.

ఒకవేళ పోటీ చేసినా ఆమె గెలుస్తారా అన్నది మరో ప్రశ్న. గెలుపు సంగతి పక్కన పెడితే డిపాజిట్లు వస్తాయా అన్నది మూడో ప్రశ్న. ఇవన్నీ ఎందుకు అంటే షర్మిలతో పాటు ఆమె ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో ఇబ్బందుల్లో ఉంది. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్ ని జాకీలు పెట్టి లేపినా ఈ రెండు నెలలలో లేచి కూర్చునే సీన్ అయితే లేదు.

ఇక మొత్తం 175 సీట్లకు అభ్యర్ధులు కాంగ్రెస్ కి దొరుకుతారా అన్నది కూడా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే 2019లో జనసేన కూడా మొత్తం సీట్లకు పోటీ చేయలేకపోయింది. 137కే ఆ పార్టీ పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చినవి ఏడో ఎనిమిదో. పవన్ కళ్యాణ్ అంటే సినీ గ్లామర్ ప్లస్ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారుగా ఉన్నారు. అయినా ఆయన పార్టీ పెర్ఫార్మెన్స్ అలా ఉంది. ఇక కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటేనే పవన్ రెండు చోట్లా గెలవలేదు.

ఇపుడు షర్మిల గెలవడం సాధ్యపడుతుందా అన్నది ప్రశ్న. ఆమె పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారు అని ప్రచారం సాగుతోంది. కానీ పులివెందులలో వైఎస్ జగన్ ఉన్నారు. ఆయనకు 2019లో తొంబై వేల భారీ మెజారిటీ దక్కింది. ఈసారి కూడా దానికంటే కొంచెం తగ్గుతుందేమో కానీ ఆయన ఘన విజయాన్ని ఎవరూ ఆపలేరు అనే అంటున్నారు. పులివెందులలో కూడా ఇదే రకమైన డిస్కషన్ ఉంది.

షర్మిల వచ్చి పోటీ చేసినా కొంత శాతం ఓట్లు చీలుస్తారేమో కానీ గెలుపు ఆమెకు అసాధ్యం అంటున్నారు. అయితే పులివెందులలో ఆమె పోటీ చేస్తే డిపాజిట్లు వస్తాయా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తం రెండు లక్షలకు పైగా ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గం మొదటి నుంచి ఏక పక్షం , వైఎస్ కుటుంబ పక్షం. మరి అదే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేస్తే వైఎస్సార్ ముద్ర ఉన్న వారికే ఓటెత్తుతారు. ఇది 2011లో రుజువు అయింది. వివేకా మంత్రిగా ఉంటూ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే వైఎస్ విజయమ్మ వైసీపీ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే వివేకాకు డిపాజిట్లు దక్కాయి.

కారణం ఆయన కాంగ్రెస్ లో ఎంపీగా కూడా చేసి ఉన్నారు అనుభవం కలిగిన రాజకీయ నేతగా గుర్తింపు ఉంది. షర్మిల విషయం అలా కాదు, ఆమె ఎంతగా పులివెందుల తనది అని చెప్పినా ఆమె హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆమెకు అక్కడ కాంగ్రెస్ తరఫున మందీ మార్బలం అయితే పెద్దగా ఉండదు. అయితే జనసేన టీడెపీఎ మద్దతు ఇస్తే మాత్రం ఆమె కొంతవరకూ పోటీ ఇవ్వగలరు. అపుడు డిపాజిట్లు కూడా వస్తాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే పులివెందులలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే షర్మిల ఏపీలో ఎక్కడ పోటీ చేసినా రెండు లక్షల ఓట్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో పదివేల ఓట్లు అయినా ఆమె తెచ్చుకోవడం జరుగుతుందా అన్నది మరో ప్రశ్న. దీని మీద వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ షర్మిలకు ఎక్కడా కూడా డిపాజిట్లు రావు అని జోస్యం చెప్పారు. అసలు కాంగ్రెస్ పార్టీకే ఏపీలో ఎక్కడా డిపాజిట్లు వచ్చేది లేదని ఆయన అన్నారు. మొత్తానికి షర్మిలకు ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడం, తాను అయినా గెలవడం అతి పెద్ద సవాల్ అని అంటున్నారు.