Begin typing your search above and press return to search.

షర్మిల ఎట్టకేలకు...!

షర్మిలలో రాజకీయ ఆశలు ఆకాంక్షలు చాలానే ఉన్నాయన్నది జనాలకు మూడేళ్ళ క్రితం వరకూ తెలియదు

By:  Tupaki Desk   |   2 April 2024 3:30 PM GMT
షర్మిల ఎట్టకేలకు...!
X

షర్మిలలో రాజకీయ ఆశలు ఆకాంక్షలు చాలానే ఉన్నాయన్నది జనాలకు మూడేళ్ళ క్రితం వరకూ తెలియదు. అయితే ఆమె కూడా తన అన్న జగన్ లాగానే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనుకున్నారు అని అంటారు. 2014లోనే ఆమె ఎంపీగా కడప నుంచి పోటీ చేయాలని భావించారు అని అంటారు. కానీ అది కుదరలేదు.

ఆ టికెట్ వైఎస్ అవినాష్ రెడ్డికి వెళ్లింది. బహుశా నాటి నుంచే ఫ్యామిలీలో కొంత అసంతృప్తి మొదలైంది అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట. ఇక అప్పట్లో వైసీపీ కేవలం ప్రతిపక్షానికి పరిమితం అయింది. 2019లో వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. రెండోమారు అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చారు.

షర్మిల అయితే వైసీపీ విజయం కోసం ప్రచారం చేశారు. అలా స్టార్ కాంపెనియర్ పాత్రకే ఆమె పరిమితం అయ్యారు అని అంటారు. కానీ షర్మిలకు చట్ట సభలలో అడుగు పెట్టాలని ఉందని అంటారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో షర్మిల ఎంపీ సీటు ఆశించారు అని మరో ప్రచారం కూడా ఉంది.

ఆనాడు ఏకంగా నలుగురు ఎంపీలను పంపగలిగే బలం ఉన్న వైసీపీ ఎందుకో షర్మిలను పంపించలేదు. దాంతో ఆమెకు రాజకీయాలు ఇష్టం లేదు అనే బయట వారు అంతా అనుకున్నారు. అయితే వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు అంటూ టీడీపీ అనుకూల మీడియా రాసింది. చివరికి అదే నిజం అయింది. 2021లో షర్మిల తెలంగాణాలో పార్టీని పెట్టారు. దాని పేరుని వైఎస్సార్టీపీగా నామకరణం చేశారు.

ఆ మీదట ఆమె తెలంగాణాలో బాగా తిరిగారు. మూడు వేల కిలోమీటర్లు పై చిలుకు పాదయాత్ర చేశారు. తీరా 2023లో తెలంగాణాలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు.

ఇక ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. నోటా కంటే తక్కువ ఓట్లు అన్ని చోట్లా డిపాజిట్లు గల్లంతుతో ఆ పార్టీ ఉనికి పోరాటం చేస్తోంది. అయితే ఆ పార్టీ సారధిగా షర్మిల కోరిక మాత్రం తీరుతోంది. ఆమె కడప నుంచి 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఒక విధంగా ఇది వైఎస్సార్ ఫ్యామిలీలో రికార్డుగా చూడాలి.

కడప ఎంపీగా వైఎస్సార్ అనేక సార్లు గెలిచారు. ఆయన సోదరుడు వైఎస్ వివేకా కూడా ఎంపీ అయ్యారు. జగన్ రెండు సార్లు ఎంపీ అయ్యారు. వైఎస్ అవినాష్ రెడ్డి రెండు సార్లు ఎంపీ అయ్యారు. ఇపుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె వైసీపీ నుంచి పోటీ చేస్తారు అనుకుంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు.

ఇది రాజకీయాల్లో మాయాజాలంగా చూడాలి. తాను కడప ఎంపీగా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో షర్మిల చెప్పారు. తన చిన్నాన్న చివరి కోరిక అది అని అన్నారు. 2019లో తనను కడప ఎంపీగా పోటీ చేయమని ఆయన కోరరని కూడా చెప్పారు. అది ఇపుడు సాకారం అయింది అన్నారు. ఇక వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ కి కడప ఎంపీ టికెట్ ఇవ్వడం జగన్ అహంకారానికి నిదర్శనం అని షర్మిల హాట్ కామెంట్ చేశారు.

అందుకే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నాను అని కూడా అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. కానీ గెలిచే వారు కావాలి. అలా చూస్తే కడపలో కాంగ్రెస్ బలం ఎంత అన్నది చర్చ. కేవలం షర్మిల సొంత ఇమేజ్ తో గెలుపు సాధ్యం కాదు. కాకపోతే ఆమె ఓట్లు చీల్చగలుగుతారు. కడపలో ఆమె వల్ల ఎన్ని ఓట్లు చీలుతాయి అన్నది కూడా చూడాలి. ఓటర్లు గత మూడు దశాబ్దాలుగా బాగా మారిపోయారు.

వారు గెలుపు గుర్రాలకే ఓట్లు వేస్తున్నారు. మూడవ పార్టీలకు ఆదరించడంలేదు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి చూసిన వారు తమ ఓటు మురిగిపోతుందని భావిస్తే కనుక కడప ఎంపీగా పోటీ చేయడం తప్ప గెలుపు అన్నది షర్మిలకు ఉండదు. మరో విధంగా చెప్పాలీ అంటే ఆమె రాజకీయంగా దుస్సాహమే చేస్తున్నారు. ఆమె రాజకీయ జీవితం ఓటమితో మొదలవుతుందా అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఓటమితో ఆరంభం అయితే గెలుపు దిశగా పయనానికి అతి పెద్ద ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఏపీలో వైసీపీని ఓడిస్తే చాలు అన్నది ఆమె అజెండా అయితే మాత్రం ఆమె ఓటమిని కూడా భరిస్తున్నారు అనుకోవాల్సిందే.