Begin typing your search above and press return to search.

తొందరపడి షర్మిల ముందే కూశారా?

రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే సరైన సమయంలో సరైన ప్లాన్ ఎంతో ముఖ్యం. చిన్న పొరపాటు కూడా ఎంతో చేటు చేస్తుంది. ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పరిస్థితి కూడా ఇలాగే మారిందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   26 Sep 2023 2:49 PM GMT
తొందరపడి షర్మిల ముందే కూశారా?
X

రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే సరైన సమయంలో సరైన ప్లాన్ ఎంతో ముఖ్యం. చిన్న పొరపాటు కూడా ఎంతో చేటు చేస్తుంది. ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పరిస్థితి కూడా ఇలాగే మారిందని చెప్పాలి. అటు కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయకముందే ఈ విషయాన్ని ప్రచారం చేసుకుని షర్మిల ఇబ్బందుల్లో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల ఈ విషయంలో తొందరపడ్డారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో తన తండ్రి, దివంగత వైఎస్సార్ పేరుతో పార్టీ పెట్టి రాజకీయాల్లో కీలకంగా మారాలని షర్మిల భావించారు. కానీ పార్టీకి అనుకున్న మైలేజీ రాలేదు. ప్రజల్లో ఆదరణ దక్కడం లేదు. దీంతో కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో రెండు, మూడు సార్లు చర్చించారు. కానీ విలీనం దిశగా ఎలాంటి అడుగు పడటం లేదు. మరోవైపు కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం కాబోతుందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. దీంతో షర్మిల పార్టీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే భావన ప్రజల్లోకి వెళ్లిందనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో షర్మిల ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

విలీనంపై కాంగ్రెస్ ప్రకటన కోషం షర్మిల ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 30 వరకు ఎలాంటి ప్రకటన రాకపోతే తమ పార్టీ ఒంటరిగానే సాగుతుందని షర్మిల స్పష్టం చేశారు. కానీ ఇప్పటికే ఆలస్యమైందని చెప్పాలి. ఇప్పటివరకూ కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తామని చెప్పి.. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రజల దగ్గరకు ఎలా వెళ్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలా ప్రజల దగ్గరకు వెళ్లినంత మాత్రాన ఆదరణ దక్కుతుందా? అన్నది ఇక్కడ మరో ప్రశ్న. ఎలాగో కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్నారు కాబట్టి షర్మిలకు ఓటు వేస్తే ఏం ప్రయోజనం ఉంటుందనే సందేహాలు రేకెత్తుతాయనే చెప్పాలి. అందుకే విలీనం విషయం తుది ప్రకటన వచ్చేంత వరకూ షర్మిల సైలెంట్గా ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ విలీనం జరిగితే కాంగ్రెస్ లో షర్మిల సాగేవారు. లేదంటే ఎప్పటిలాగే పార్టీని నడిపించేవారు. కానీ ఇప్పుడు తొందరపడి రెంటికి చెడ్డ రేవడిలా షర్మిల పరిస్థితి మారిందని టాక్.