Begin typing your search above and press return to search.

త్రిముఖ పోరుకు తెరలేపిన షర్మిళ... ఎన్నికల వేళ అనూహ్యం నిర్ణయం!

ఇందులో భాగంగా... పీసీసీ చీఫ్ షర్మిళ కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   31 March 2024 5:52 AM GMT
త్రిముఖ పోరుకు తెరలేపిన  షర్మిళ... ఎన్నికల వేళ అనూహ్యం  నిర్ణయం!
X

నిన్నమొన్నటి వరకూ కాస్త స్తబ్ధగా ఉన్నట్లు కనిపించిన వైఎస్ షర్మిళ... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా... ఏప్రిల్ 1 న ఏపీలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా... షర్మిల కడపను టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఇదే సమయంలో... టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి వర్సెస్ వైసీపీ పోరును త్రిముఖ పోరుగా మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో కాంగ్రెస్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా... పీసీసీ చీఫ్ షర్మిళ కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ అభ్యర్థుల జాబితానూ సిద్ధం చేశారని తెలుస్తుంది. ఈ జాబితా విడుదలకు సోమవారం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో వామపక్షాలతో కలిసి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్.. ఎవరి ఓటు బ్యాంక్ కు గండి కొడతరానే చర్చ తెరపైకి వచ్చింది.

రానున్న ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం విషయానికొస్తే... ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ నుంచి జమ్మలమడుగు ఇన్ ఛార్జ్ భూపేశ్ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించింది. దీంతో కడపలో ద్విముఖ పోరే, మిగిలిన అభర్థులు ఎవరున్నా అది నామమాత్రపు ప్రభావమే చూపించే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్న వేళ... అనూహ్యంగా షర్మిళ పేరు తెరపైకి వచ్చింది.

ఇదే సమయంలో సంక్షేమానికి అత్యంత పెద్ద పీట వేస్తున్నట్లుగా 9 గ్యారెంటీలను ప్రకటించారు షర్మిళ. ఇందులో భాగంగా... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10ఏళ్ల పాటు ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తామని షర్మిళ ప్రకటించారు. ఇక రెండోదిగా... ప్రతీ పేద మహిళకూ నెలకు రూ.8,500 ఇస్తామని తెలిపారు. ఇదే క్రమంలో మూడో గ్యారెంటీగా... రైతులకు రెండు లక్షల వరకూ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు షర్మిళ.

ఇదే క్రమంలో... 4వ గ్యారెంటీ కూడా రైతులను దృష్టిలో పెట్టుకునే ఎంపిక చేయగా... పెట్టుబడి మీద 50శాతం లాభంతో కొత్త మద్దతు ధర కల్పిస్తామనే గ్యారెంటీని ఇచ్చారు. ఇక ఐదో గ్యారెంటీగా ఉపాది హామీ పథకం కింద కూలీలకు కనిస వేతనం రూ. 400 ఉండేలా చేస్తామని ప్రకటించారు. ఆరో గ్యారెంటీ కింద కేజీ టూ పీజీ ఉచిత విద్య పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది.

ప్రధానంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీని 7వ గ్యారెంటీగా ప్రకటించిన షర్మిళ... అధికారంలోకి రాగానే తొలిసంతకం ఆ ఫైలు మీదే అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రతీ పేద కుటుంబానికీ మహిళ పేరు మీద రూ.5 లక్షలతో పక్కా ఇల్లు అందిస్తామని 8వ గ్యారెంటీ హామీ ఇవ్వగా... కీలకమైన పెన్షన్స్ విధానంపై 9వ గ్యారెంటీ హామీని ప్రకటించారు.

ఇందులో భాగంగా... అర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. పైగా... ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ ఈ పెన్షన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీంతో.. ఏపీలో ఈ 9 గ్యారెంటీలూ ఏ మేరకు ప్రభావం చూపబోతున్నాయనేది వేచి చూడాలి! మరోపక్క ఇప్పటికే చంద్రబాబు... సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే!!