Begin typing your search above and press return to search.

రాజన్న బిడ్డ అయితే ఎన్నుకోవాల్సిందేనా ?

దాని కంటే ముందు ఆయన వైఎస్సార్ తరఫున ఎన్నికల ప్రచారం కడపలో చాలా సార్లు నిర్వహించారు.

By:  Tupaki Desk   |   13 April 2024 3:00 PM GMT
రాజన్న బిడ్డ అయితే ఎన్నుకోవాల్సిందేనా ?
X

షర్మిల కడప జిల్లా పర్యటనలో మాట మాటకు తాను రాజన్న బిడ్డను అంటున్నారు. రాజన్న బిడ్డ అన్నదే ఆమె రాజకీయానికి అర్హత అనుకుంటున్నారా అన్న చర్చ వస్తోంది. ఉదాహరణకు జగన్ రాజన్న బిడ్డ అని జనాలు ఎన్నుకున్నారు అని ఆమె అనుకోవచ్చు. కానీ జగన్ 2009లోనే ఎంపీగా కాంగ్రెస్ తరఫున నెగ్గారు. దాని కంటే ముందు ఆయన వైఎస్సార్ తరఫున ఎన్నికల ప్రచారం కడపలో చాలా సార్లు నిర్వహించారు.

అలా ఎంతో కొంత రాజకీయ అనుభవం వచ్చిన తరువాత వైఎస్సార్ ఆయన్ని ఎంపీగా ఎంపిక చేశారు. ఇక వైఎస్సార్ మరణించేనాటికి జగన్ ఎంపీగా ఉండడం అన్నది మరవరాదు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి మరోసారి తన పార్టీ గుర్తు మీద ఎంపీగా అయిదున్నర లక్షల ఓట్లతో నెగ్గి తన నాయకత్వాన్ని రుజువు చేసుకున్నారు అన్నది గమనించాలి.

ఆ తరువాత జగన్ జైలులో ఉండగా జరిగిన 18 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల్లో పదహారు వైసీపీ గెలుచుకుంది. అప్పట్లో షర్మిల విజయమ్మ ప్రచారం చేయవచ్చు. కానీ కేంద్ర బిందువు జగన్ అనే కదా అంత రాజకీయం నడచింది అన్నది గుర్తు చేసుకోవాలి. జగన్ ప్రతీ దశలోనూ పోరాటం చేశారు. తన నాయకత్వాన్ని పెంచుకుంటూ వెళ్లారు

ఆయన మీద నమ్మకంతో కాంగ్రెస్ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న పార్టీ నుంచి వచ్చి వైసీపీలో చేరారు. ఇవన్నీ ఆయనకు రాజన్న బిడ్డగా మాత్రమే రాలేదు అని గుర్తు చేసుకోవాలి. రాజకీయాల్లో మొండితనం ఉండాలి. పట్టుదల ఉండాలి, వాటితో పాటుగా వ్యూహాలు ఉండాలి. ప్రజలను ఆకర్షించే శక్తి ఉండాలి. వారికి నాయకత్వం అందిస్తామని భరోసా ఇవ్వాలి.

షర్మిల విషయం తీసుకుంటే ఆమె వైఎస్సార్ నాయకత్వం విషయంలో పోటీ పడడంలో తప్పు లేదు. కానీ ఆమె ముందు తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవాలి. ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టి రెండేళ్ళు తిరగకుండా మూసేసారు అన్నది ఆమె పొలిటికల్ కెరీర్ కి ఆరంభంలోనే మచ్చగా మారింది. ఆమె ఎన్నికల్లో ఇప్పటిదాకా పోటీ చేయలేదు. ఎవరైనా జనంలో గెలిస్తేనే లీడర్ షిప్ నిలబడుతుంది. అలా కాకుండా పార్టీ పదవుల్లో ఉంటూ తాము గొప్ప నాయకులమి భావిస్తే భ్రమల్లో ఉన్నారనే అనుకుంటారు.

జగన్ కంటే తాను ఎక్కువ అని వైఎస్సార్ కి అసలైన వారసురాలిని తానే అని షర్మిల అనుకోవచ్చు. కానీ అది జనాలు చెప్పాలి. వారే తీర్పు ఇవ్వాలి. అది జరగాలంటే ఆమె తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకోవాలి. దానికి సరైన మార్గం ఎన్నికల్లో నెగ్గడం. సరే ఆమె ఇపుడు కడప ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు. తొలిసారి ఎన్నికలను ఆమె ఫేస్ చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆమె అనుసరిస్తున్న మార్గం ఏంటి అంటే వైసీపీని నిందించడం, జగన్ ని తప్పు పట్టడం వైఎస్ వివేకా హత్యను ఉపయోగించుకోవడం అని అంటున్నారు. అయిదేళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసు విషయంలో ఎన్నికల ముందు వచ్చి షర్మిల యాగీ చేస్తే ఆమెకు ఓటు వేయాలని ఉందా అన్నది ప్రశ్న. చిన్నాన్న ఆఖరి కోరిక తీరుస్తాను అన్న ఆమె 2021లో ఏపీలోనే పార్టీ పెట్టి పోరాడవచ్చు కదా అన్నది ఒక ప్రశ్న. ఆనాడే కాంగ్రెస్ లో చేరి తన తండ్రి వైఎస్సార్ ఆఖరి కోరిక అయిన రాహుల్ ని ప్రధాని చేయడం కోసం పని చేయవచ్చు కదా.

ఇవన్నీ సగటు జనంలో వచ్చే సందేహాలు. ప్రజా జీవితంలో వీటికి జవాబు షర్మిల సహా ఏ నాయకుడు అయినా చెప్పుకోవాలి. ఇక వివేకా హత్య కేసు తీసుకుంటే అవినాష్ ని హంతకుడు అని అంటున్నారు. ఆయన నిందితుడు మాత్రమే అని ఆమె ఎందుకు భావించలేకపోతున్నారు. ఏ కేసు అయినా కోర్టు తీర్పు వచ్చేంతవరకూ ఎవరైన నిందితుడుగానే ఉంటారు అన్నది కూడా ఆలోచించాలి కదా అంటున్నారు.

కడప జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి విషయం కూడా ప్రస్తావించాలి కదా. కొంగు చాచి సెంటిమెంట్లు పండిస్తే ఓట్లు పడతాయా అని ఆమె సొంత మేనత్త విమలారెడ్డి ఎద్దేవా చేయడాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ ఏపీలో బలహీనంగా ఉంది. కడపలో ఎంపీగా గెలవాలి అంటే కనీసం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో అయినా మెజారిటీ దక్కాలి. అక్కడ వైసీపీ బలంగా ఉంది. ఆ తరువాత టీడీపీ ఉంది. కాంగ్రెస్ కి టీడీపీ మద్దతు లోపాయికారిగా ఇచ్చినా గట్టి పోటీ ఇస్తారేమో కానీ షర్మిల గెలిచే అవకాశాలు ఉండవని సర్వేలు చెబుతున్నాయి.

టీడీపీ వైఎస్సార్ ఫ్యామిలీ గొడవలో కడప సీటుని నలభై ఏళ్ల తరువాత తాము గెలవాలని చూస్తుంది తప్ప షర్మిలకు ఎందుకు చాన్స్ ఇస్తుంది. అలా ఇవ్వాలనుకున్నా అది బూమరాంగ్ అవుతుంది అని అంటున్నారు. మొత్తం మీద షర్మిల అనుకున్నంత ఈజీగా కాదు కడప గడపలో గెలవడం. తాను రాజన్న బిడ్డను అన్నది అర్హత అనుకుని ఆమె రాజకీయం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో జూన్ 4 తరువాతనే ఆమెతో సహా అంతా చూడాల్సి ఉంటుందని అంటున్నారు రాజకీయ పండితులు.