Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరూ కుమ్మక్కు.. మోడీ పంగనామాలు...!

తిరుపతి సభలో షర్మిల బీజేపీ మీద ప్రధాని నరేంద్ర మోడీ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   1 March 2024 3:28 PM GMT
ఆ ఇద్దరూ కుమ్మక్కు.. మోడీ పంగనామాలు...!
X

దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం అని కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే ఏపీకి కూడా మేలు అని ఆమె అంటున్నారు. రాహుల్ గాంధీ ప్రధానిగా చేసే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదనే అని షర్మిల చెప్పారు. ఈ మేరకు ఆమె తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ సభలో హామీ ఇచ్చేశారు.

తిరుపతి సభలో షర్మిల బీజేపీ మీద ప్రధాని నరేంద్ర మోడీ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి పదేళ్ల క్రితం తిరుపతి సభలో ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాను అని అన్నారని గుర్తు చేశారు. ఆ హామీని ఆయన నిలబెట్టుకున్నారా అని సభికుల మధ్య నుంచే ఆమె మోడీని నిలదీశారు. అంతే కాదు రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా మోడీ నెరవేర్చలేదు అని షర్మిల విమర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర ప్రజల హక్కు అని షర్మిల అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆ హోదా అన్నది సాధించడం సాధ్యపడుతుందని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ వల్లనే ఏపీ బాగుపడుతుందని షర్మిల చెప్పుకొచ్చారు.

తిరుపతి వంటి పుణ్య క్షేత్రంలో నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా మీద హామీ ఇచ్చారు అని దాన్ని మరచి పోవడం బాధాకరం అన్నారు. ఏపీకి అద్భుతమైన రాజధానికి కూడా నిర్మించి ఇస్తామని నరేంద్ర మోడీ ఇదే తిరుపతిలో హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. విభజన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తామని కూడా చెప్పారని అన్నారు. అయితే ఏపీకి మాత్రం ఏ ఒక్కటీ ఇచ్చింది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

పునర్ విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశం ఏపీ ప్రజల హక్కు అని ఆమె స్పష్టం చేశరు. ఏపీకి అద్భుతమైన రాజధాని నిర్మాణం, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్, ఉత్తరాంధ్ర, రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు కూడా ఏపీకి కేంద్రం నెరవేర్చాల్సి ఉందని అన్నారు.

కానీ మోడీ మాత్రం అసలు ఏ ఒక్క హామీని పట్టించుకోలేదని షర్మిల విమర్శించారు. ఏపీలో గత పదేళ్ళలో టీడీపీ వైసీపీ రెండు ప్రభుత్వాలు ఉన్నాయని ఈ ప్రభుత్వాలు కేంద్రం నుంచి ఒక్క హమీని కూడా సాధించలేకపోగా కేంద్రంతో కుమ్మక్కు అయ్యాయని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు జగన్ కేంద్రంతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఈ పార్టీలని ఓడించి ఏపీలో దేశంలో కాంగ్రెస్ ని తిరిగి అధికారంలోకి తీసుకుని రావాలని ఆమె ప్రజలను కోరారు.