Begin typing your search above and press return to search.

షర్మిల డెసిషన్...రాజకీయ మరణ శాసనమేనా...?

తెలంగాణాలో పార్టీ పెట్టి మూడేళ్ళుగా లాక్కువచ్చిన వైఎస్ షర్మిల వ్యూహాలు లేక చివరికి చతికిలపడుతున్నారా అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 9:16 AM GMT
షర్మిల డెసిషన్...రాజకీయ మరణ శాసనమేనా...?
X

తెలంగాణాలో పార్టీ పెట్టి మూడేళ్ళుగా లాక్కువచ్చిన వైఎస్ షర్మిల వ్యూహాలు లేక చివరికి చతికిలపడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. ఆమె తన చేతిలో ఉన్న ఆప్షన్లను సరిగ్గా వాడుకోలేదా అన్న మాట కూడా ఉందిపుడు. ఎందుకంటే కాంగ్రెస్ ఇపుడు పైకి లేస్తున్న కడలి కెరటంగా ఉంది. ఆ పార్టీతో షర్మిల పార్టీ విలీనం ఆమె సుదీర్ఘ రాజకీయ జీవితానికి బాటలు వేసి ఉండేది.

అయితే కాంగ్రెస్ లాంటి అతి పెద్ద జాతీయ పార్టీకి షర్మిల కండిషన్లు పెట్టారని అంటున్నారు. తాను తెలంగాణా దాటి పాలిటిక్స్ చేయనని పాలేరు నుంచి పోటీ చేస్తానని ఆమె చెప్పడంతోనే కాంగ్రెస్ తో వైఎస్సార్టీపీ విలీనం చివరి నిముషంలో నిలిచిపోయింది అని అంటున్నారు.

ఇక రేపో మాపో విలీనం అంటూ షర్మిల ఎన్నికల ముందు విలువైన కాలం అంతా వేస్ట్ చేశారు అని అంటున్నారు. కాంగ్రెస్ హై కమాండ్ అయితే ఆమెను వైఎస్సార్ తనయగా గుర్తించింది. ఆమె సేవలను ఏపీ కాంగ్రెస్ కి వాడుకోవాలని కూడా ప్రతిపాదించింది. ఎందుకంటే కాంగ్రెస్ కి తెలంగాణాలో నేతలు చాలా మంది ఉన్నారు. పార్టీ పటిష్టంగా ఉంది. ఏమీ లేని చోటనే కదా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని వాడుకునేది.

అలా కనుక ఆలోచిస్తే షర్మిలని కాంగ్రెస్ కేవలం ఏపీ కోసమే తీసుకుంది. ఎంత కాదన్నా వైఎస్ షర్మిల రాజకీయ మూలాలు ఏపీలోనే ఉన్నాయి. ఆమె తండ్రి పేరుతో రాజకీయం చేస్తున్నారు కాబట్టి కార్యక్షేత్రం ఏపీ అయితేనే ఆమెకు మేలు ఆమె వల్ల కాంగ్రెస్ కి మేలు అని హస్తం పార్టీ నేతలు తలచారు. ఇందుకు గానూ ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని కూడా ప్రతిపాదించారు.

కానీ షర్మిల మాత్రం ససేమిరా అనేశారు. తాను తెలంగాణా నుంచి రాజకీయం చేస్తాను అన్నారు. ఫలితంగా విలీనం లేకుండా పోయింది. ఇక ఎన్నికలు గట్టిగా నెలన్నరకు వచ్చాయనగా ఏకంగా 119 మంది అభ్యర్ధులను పెట్టి పోటీకి ఒంటరిగా దిగుతామని షర్మిల ప్రకటించడం ఏకంగా ఆమె రాజకీయ జీవితానికే మరణ శాససనం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక్క షర్మిల తప్ప సీరియస్ గా కంటెస్ట్ చేసే అభ్యర్ధులు అయితే ఆమె పార్టీకి లేరు. ఇక షర్మిల విషయమే తీసుకుంటే పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఆయన బిగ్ షాట్ గా ఉన్నారు. అలాగే బీయారెస్ నుంచి కందుల ఉపేందర్ రెడ్డి బరిలో ఉంటున్నారు. ఈ ఇద్దరి మధ్య హోరా హోరీ పోరు సాగనుంది.

మధ్యలో షర్మిల నిలబడితే గెలుపు ఆశలు పక్కన పెట్టి కనీసం డిపాజిట్లు వస్తాయా అన్న చర్చ సాగుతోంది. తాను ఓడిపోయి అది కూడా దారుణమైన ఓటమి అయితే షర్మిల ఏమి సాధించినట్లు అని కూడా అంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఒక్కటే ప్రమాణం. షర్మిల ఏ మహిళా చేయని సాహసం చేశారు. ఏకంగా 3,800 కిలోమీటర్ల దూరం నడచారు.

అదే టైం లో ఆమె పార్టీని పటిష్టం చేసుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్ లో విలీనం అంటూ సొంత పార్టీలో ఉన్న వారిలోనూ అనుమానాలు రేకెత్తించారు. సమయం కుదిరి అనుకున్న కండిషన్లకు ఓకే అంటే ఆమె పార్టీ విలీనం అయ్యేదన్న చర్చ అయితే ఉంది.

ఇక మొత్తం 119 సీట్లు అని కాదు కనీసం పది నుంచి పదిహేను సీట్ల మీద అయినా ఫోకస్ పెట్టి ఉంటే ఎంతో కొంత బెటర్ గా ఉండేది అని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కాకపోయినా వేరే పార్టీలతో అయినా పొత్తు పెట్టుకుని బరిలోకి దిగినా అర్ధం ఉండేది అంటున్నారు. ఏమీ కాకుండా సింగిల్ గా పోటీ అంటూ ఆమె దిగితే ఏమి సాధిస్తారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె కనుక ఓటమి పాలు అయితే రేపటి రోజున అంటే డిసెంబర్ 3 రిజల్ట్స్ తరువాత వైఎస్సార్టీపీ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని కూడా అంటున్నారు. మరి షర్మిల డేరింగ్ ఏంటి అన్నది కూడా అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇపుడు.