Begin typing your search above and press return to search.

ఢిల్లీకి అర్జంటుగా : కాంగ్రెస్ నేతగా మారనున్న షర్మిల...?

కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి వైఎస్ షర్మిల ఆరాటపడుతున్నారని ప్రచారం ఉంది. ఆమె అర్జెంటుగా ఢిల్లీకి వెళ్లారు.

By:  Tupaki Desk   |   11 Aug 2023 5:05 PM GMT
ఢిల్లీకి అర్జంటుగా : కాంగ్రెస్ నేతగా మారనున్న షర్మిల...?
X

కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి వైఎస్ షర్మిల ఆరాటపడుతున్నారని ప్రచారం ఉంది. ఆమె అర్జెంటుగా ఢిల్లీకి వెళ్లారు. దాంతో ఆమె పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు. ఈ ప్రక్రియ అంతా ఈ నెల 12న జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఢిల్లీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు.

అదే విధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సైతం భేటీ అవుతారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తన డిమాండ్లు కొన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచుతారు అని అంటున్నారు. ఆ తరువాతనే విలీనం జరుగుతుంది. ఇదంతా చకచకా సాగే ప్రహసనం అని అంటున్నారు. ఇక ఈ మొత్తం ప్రక్రియకు సంధాన కర్తగా కర్నాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

ఆయన ద్వారా ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పెద్దలకు తన మనసులోని ఆలోచనలు తన డిమాండ్లను చేరవేశారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే తాను తెలంగాణాలో ఎక్కడ నుంచి పోటీ చేసే విషయంతో పాటు తన వర్గానికి కొన్ని సీట్లను ఆమె ఇప్పించుకుంటారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఢిల్లీలో షర్మిల అంటే ఆమె పార్టీ విలీనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనే అంటున్నారు.

మరో వైపు చూస్తే ఇప్పటికి దాదాపు 12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీతో విభేదించి అన్న జగన్ తల్లి విజయమ్మతో షర్మిల కాంగ్రెస్ నుంచి దూరం అయ్యారు. నిజానికి అప్పటికి ఆమె రాజకీయంగా ఏమీ లేరు. కానీ కాంగ్రెస్ కుటుంబంగా ఉన్న వైఎస్సార్ ఫ్యామిలీ అలా హస్తం నీడ నుంచి బయటకు వచ్చింది.

ఆ తరువాత అన్న కోసం ఆమె పాదయాత్ర చేయడం, 2014, 2019లలో ఎన్నికల ప్రచారం చేయడం ద్వారా రాజకీయ నాయకురాలిగా మారారు. ఇక ఆమె వైఎస్సార్టీపీని తెలంగాణాలో స్థాపించారు. గట్టిగా రెండేళ్ళు తిరగకుండానే ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడమే విశేషంగా చెప్పాలి.

కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం అన్నపుడు ఆమె ఖండిస్తూ వచ్చారు. మూడు వేల అయిదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది పార్టీని విలీనం చేయడానికా అని ఫైర్ అయ్యేవారు. ఇపుడు మాత్రం ఆమె అదే చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఆమె కాంగ్రెస్ లో చేరడానికి కారణాలు ఆలోచనలు వేరు అని అంటున్నారు. ఆమె తెలంగాణాలో రాజకీయం చేయాలని చూస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించడంతో అసెంబ్లీకి పోటీ చేసి గెలిచి ముందు మంత్రి కావాలని ఆ మీదట రాజకీయాల్లో తనను మరింత గా రుజువు చేసుకుని కీలకమైన పాత్ర పదవి వైపుగా సాగాలని ఉందని ప్రచారం అయితే ఉంది.

కానీ కాంగ్రెస్ పెద్దల ఆలోచనలు వేరు. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని అంతా జగన్ కొల్లగొట్టారు. ఆ ఓటు బ్యాంక్ ని తిరిగి వెనక్కి రప్పించేందుకు వైఎస్సార్ కుమార్తెగా షర్మిల ఎంతో కొంత ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పెద్దలు ఆమెను చేరదీస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆమె కోరినట్లుగా తెలంగాణాలో పోటీకి అంగీకరిస్తారా అన్న చర్చ సాగుతోంది. ముందు పార్టీని విలీనం చేసి కాంగెర్స్ నాయకురాలిగా మారితే ఇక హై కమాండ్ చెప్పినట్లుగానే చేయాలి. మొత్తానికి షర్మిల ఆలోచనలు ఏమిటి, ఎవరు నడిపిస్తున్నారు, ఆమెకు కాంగ్రెస్ హై కమాండ్ నుంచి దక్కే హామీలు ఏంటి అన్నది మాత్రం ఇప్పటికీ బయటకు తెలియని విషయంగానే ఉంది అని అంటున్నారు.