Begin typing your search above and press return to search.

షర్మిలకు కాంగ్రెస్ లో కొత్త పోస్ట్... పోటీ చేసేది అక్కడేనట...?

ఇక షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోటీ చేయడానికి రెడీ అయ్యారు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 7:15 AM GMT
షర్మిలకు  కాంగ్రెస్ లో కొత్త పోస్ట్... పోటీ చేసేది అక్కడేనట...?
X

వైఎస్ షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రంగం సిద్ధం అయిపోయింది అని అంటున్నారు. ప్రస్తుతం కౌంట్ డౌన్ స్టేజ్ లో ఉందని చెబుతున్నారు. ఏ క్షణంలోనైనా కీలకమైన ప్రకటన వెలువడనుందని అంటున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిలకు ఏ పోస్ట్ పార్టీలో ఇవ్వాలన్నది కూడా నిర్ణయం జరిగింది అని అంటున్నారు.

ఆమె వైఎస్సార్ తనయ. కాబట్టి తండ్రి పొలిటికల్ లెగసీని పూర్తిగా రెండు రాష్ట్రాలలో వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆమెకు ఏఐసీసీ లెవెల్ లో ఇక ముఖ్య పదవికి ఇస్తారని అంటున్నారు. అలా ఇవ్వడం వల్ల ఆమె సేవలను ఏపీ తెలంగాణా రెండింటా వాడుకోవచ్చు అన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచన అని అంటున్నారు.

ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల ఈ నెల 12న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీతో భేటీ కానున్నారు అని అంటున్నారు ఆ తరువాత విలీనం ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక షర్మిల తన పార్టీని రెండేళ్ళ క్రితం స్థాపించారు. తెలంగాణాలో ఆమె మూడు వేల అయిదు వందల కిలోమేటర్ల మేర కలియతిరిగారు.

అయితే ఆమె పార్టీకి జనాదరణ లేకుండా పోయింది. ఒక్క కీలక నేత కూడా ఆమె పార్టీలో చేరలేదు. దాంతో ఆమెది ఒంటరి పోరాటం అయింది. ఈ నేపధ్యంలో షర్మిల పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం దిశగా ఆలోచనలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెకు కర్నాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పూర్తిగా సహకరించారు అని అంటున్నారు.

ఆయన నడిపిన మంత్రాంగం మూలంగా షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతోంది అని అంటున్నారు. ఇక షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఆమెను సికింద్రాబాద్ లోక్ సభ బరిలో నిలబెడతారు అని అంటున్నారు.

ఆ విధంగా ఆమె అసెంబ్లీ ఎంట్రీకి అడ్డుకట్ట ముందే వేశారని ప్రచారం సాగుతోంది. అదే విధంగా ఆమెను అటు తెలంగాణా ఇటు ఆంధ్రాలలో కాంగ్రెస్ కి స్టార్ కాంపెయినర్ గా నియమిస్తారని అంటున్నారు. ముందుగా తెలంగాణాలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఆమె ప్రచారం ఉంటుంది, అందువల్లనే ఆమె తెలంగాణా ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ హై కమాండ్ నిరాకరించింది అని అంటున్నారు.

ఆ తరువాత అంటే 2024లో ఏపీలో ఎన్నికలు జరిగే సమయానికి ఆమె ఏపీలో ఎంట్రీ ఇస్తారని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని వైసీపీ నుంచి వెనాక్కి తెచ్చే క్రమంలో ఆమె తన శక్తివంచన లేకుండా కృషి చేస్తారని కాంగ్రెస్ పెద్దలు గంపెడాశలు పెట్టుకున్నారు.

అయితే ఆమె ఏపీలో అన్న జగన్ కిఎదురు నిలిచి ప్రచారం చేస్తారా అన్నది మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ లేదు, కానీ ఒకసారి కాంగ్రెస్లో చేరాక ఆమె పార్టీ హై కమాండ్ చెప్పినదే వినాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక సికిందరాబాద్ లోక్ సభకు షర్మిల పోటీ అంటే అది 2024లో మాట. అప్పటికి ఏపీలో మారే రాజకీయ వాతావరణాన్ని చూసుకుని ఆమెను ఏపీలో అసెంబ్లీకి కూడా పోటీ చేయించవచ్చు అని అంటున్నారు.

అదే విధంగా కడప లోక్ సభ నుంచి ఎంపీగా అయినా బరిలోకి దించే ప్లాన్ కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి షర్మిల ఏమి ఆశించి కాంగ్రెస్ లో చేరుతున్నారో తెలియదు కానీ కాంగ్రెస్ మాత్రం పక్కా క్లారిటీతోనే షర్మిలను పార్టీలో చేర్చుకుంటోందని అంటున్నారు.

అందుకే ముందు ఆమెను తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల తెర మీద నుంచి సక్సెస్ ఫుల్ గా తప్పించిన కాంగ్రెస్ రేపటి రోజున తెలంగాణా రాజకీయాల నుంచి తప్పించి ఏపీ వైపే ఫోకస్ చేసేలా చూస్తుంది అని అంటున్నారు. ఈ లోగా ఆమెతో తెలంగాణాలో ప్రచారం చేయించుకోవడం ద్వారా తమ రాజకీయ అవసరాలను పూర్తి చేసుకుంటారని అంటున్నారు. మరి షర్మిల కూడా ఏ హామీ లేకుండా విలీనం చేయరు కాబట్టి అవేంటి అన్నది కూడా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.