Begin typing your search above and press return to search.

అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ కి షర్మిల చెక్ !?

కడప ఎంపీ బరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పోటీ చేయడం 2024 ఎన్నికల్లో అత్యంత కీలకమైన సంచలనమైన అంశంగా అంతా చూశారు.

By:  Tupaki Desk   |   15 May 2024 2:30 PM GMT
అవినాష్ రెడ్డి  హ్యాట్రిక్ కి షర్మిల చెక్  !?
X

కడప ఎంపీ బరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పోటీ చేయడం 2024 ఎన్నికల్లో అత్యంత కీలకమైన సంచలనమైన అంశంగా అంతా చూశారు. దానికి తోడు అయిదేళ్ల క్రితం జగనన్న వదిలిన బాణం అంటూ బై బై బాబూ అని 2019లో షర్మిల చేసిన ఎన్నికల ప్రచారం కళ్ళ ముందు ఉంది. చెవులలో వినబడుతోంది.

అలాంటిది ఈ రోజు జగన్ కి ఎదురు నిలిచి ప్రత్యర్ధులు సైతం చేయలేని విమర్శలు సొంత అన్న మీద చేయడం ద్వారా ఏపీ రాజకీయాన్ని ఆమె ఆకట్టుకున్నారు. ఇంకో వైపు చూస్తే కడప అన్నది వైఎస్సార్ కుటుంబానికి అడ్డా. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ద్వారా వైసీపీని షర్మిల గట్టిగానే సవాల్ చేసింది.

కాంగ్రెస్ అంటే అసలు పడని జగన్ కి సొంత చెల్లెలు ఆ పార్టీలోకి వెళ్ళం ఇబ్బందిని కలిగిస్తే షర్మిల కడప గడ్డ మీదనే పోటీకి సిద్ధపడడం మరో సంచలనం. ఇలా వైసీపీ ఎంపీ అభ్యర్ధి అయిన అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ కి చెక్ పెట్టాలని చాలా తీవ్ర స్థాయిలో షర్మిల పోరాటం చేశారు. ఇక 2019 ఎన్నికల్లో చూస్తే కడప ఎంపీ సీటులో కాంగ్రెస్ కి వచ్చిన ఓట్లు నోటా కంటే తక్కువ.

ఇక అవినాష్ రెడ్డికి ఏకంగా మెజారిటీయే 3 లక్షల 81 వేల దాకా వచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి 783,499 ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్ధి ఆదినారాయణరెడ్డికి 402,773 ఓట్లు వచ్చాయి. ఇలా కడప ఎంపీ సీటులో పరిస్థితి ఉంది. మరి షర్మిల ఏ లెక్కలతో ఎంపీ సీటుకు పోటీ పడుతున్నారు అంటే ఆమె రాజన్న బిడ్డను అని ఒక సెంటిమెంట్ ని రగిలించారు. తద్వారా ఆమె వైసీపీ ఓట్లకు గండి పెట్టాలని చూసారు.

అదే విధంగా బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసుని కూడా ఆమె ముందుకు తెచ్చారు. పదే పదే ఆ అంశం చుట్టూనే ప్రచారం మొత్తం సాగింది. దీని వల్ల సగటు ప్రజానీకంలో వైసీపీ పట్ల వ్యతిరేకత పెంచి తమకు అనుకూలం చేసుకోవాలని ఒక ఎత్తుగడ వేసారు. ఇక టీడీపీ నుంచి కూడా లోపాయికారీ సాయం షర్మిలకు అందింది అని పోలింగ్ అనంతర సన్నివేశాలు చెబుతున్నాయి.

అంతే కాదు వైసీపీ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది అని అంటున్నారు. అదెలా అంటే వైసీపీలో అవినాష్ రెడ్డి పట్ల కొంత అసంతృప్తి ఉన్న వారు షర్మిలకు ఓటు వేశారు అని చెబుతున్నారు. అలాగే టీడీపీ లో కూడా క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది అని అంటున్నారు. ఎమ్మెల్యేల వరకూ ఎలా ఉన్నా ఎంపీ సీటు తీసుకుంటే క్రాస్ చేసి కాంగ్రెస్ ని వేయమని ఆదేశాలు వచ్చినట్లుగా ప్రచారం సాగింది.

ఇక బీజేపీ జాతీయ స్థాయిలో ఇచ్చిన నినాదం ముస్లిమ్రిజర్వేషన్లు రద్దు అన్న దానితో ఆయా వర్గాలు కాంగ్రెస్ వైపు కొంత మొగ్గు చూపాయని అంటున్నారు. ఈ విధంగా చూస్తే షర్మిల అనూహ్యంగా బలమైన పోటీయే ఇచ్చింది అని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి చూస్తే కడప ఎంపీ సీటులో త్రిముఖ పోరు సాగాలి.

కానీ అక్కడ సెకండ ప్లేస్ లో ఉండాల్సిన టీడీపీ షర్మిల పోటీతో మూడవ ప్లేస్ లోకి వచ్చారన్న చర్చ సాగుతోంది. అంటే అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల అన్నట్లుగానే పోరు సాగింది అని అంటున్నారు. అలా వైసీపీ వ్యతిరేక ఓట్లను పోలరైజ్ చేయడంలో షర్మిల విజయవంతం అయ్యారని అంటున్నారు.

అయితే ఆ ఓట్లు ఆమె గెలిచేందుకు ఉపయోగపడతాయా అన్నదే చర్చగా ఉంది. 783,499 ఓట్లను 2019లో సాధించి 3 లక్షల 81 వేల దాకా మెజారిటీని దక్కించుకున్న అవినాష్ రెడ్డిని వెనక్కి లాగి ముందుకు వెళ్ళడం అన్నది ఇపుడున్న పరిస్థితుల్లో సాధ్యపడేది కాదని అంటున్నారు. కాకపోతే అవినాష్ రెడ్డికి వచ్చిన 3 లక్షల 81 వేల మెజారిటీని బాగా తగ్గించడంలో షర్మిల పోటీ కీలక పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు.

అలా సెకండ్ ప్లేస్ లోకి వచ్చి అవినాష్ మెజారిటీని ఏ లక్షకో పరిమితం చేసినా అది షర్మిల సక్సెస్ గానే చూడాలని అంటున్నారు. ఈ రకంగా అతి తక్కువ సమయంలో షర్మిల వైసీపీకి బిగ్ చాలెంజ్ చేసి తన ఓట్లను పెంచుకుని గట్టి పోటీ ఇస్తే మాత్రం ఆమె నాయకత్వం నిలబడినట్లే అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.