Begin typing your search above and press return to search.

ఏడు నియోజకవర్గాల్లో షర్మిళ ఎఫెక్ట్... ఓడితే వైసీపీకి 2 ప్లస్ లు!

అవును... ఏపీ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ వైఎస్ షర్మిళ.. తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 April 2024 6:49 AM GMT
ఏడు నియోజకవర్గాల్లో షర్మిళ ఎఫెక్ట్... ఓడితే వైసీపీకి 2 ప్లస్  లు!
X

రాష్ట్ర రాజకీయాల సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రస్తుతం కడప జిల్లా రాజకీయాలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి. కడప ఎంపీగా వైఎస్ షర్మిళ పోటీ చేయబోతున్నారు.. ఇక అధికారిక ప్రకటనే తరువాయనే కథనాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో.. తమ కంచుకోటలో ఫస్ట్ టైం వైఎస్ ఫ్యామిలీ రెండుగా చీలి బరిలోకి దిగుతున్న తరుణంలో.. జిల్లాలో, కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి సంచలనాలు జరగబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.

అవును... ఏపీ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ వైఎస్ షర్మిళ.. తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ప్రత్యేక హోదా పేరు చెప్పి వైఎస్ జగన్ పై ఆమె తీవ్ర వ్యాఖలు చేశారు. ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమె కడప నుంచి బరిలోకి దిగాలని ఫిక్సయ్యారని తెలుస్తుంది. దీంతో... ఫస్ట్ టైం వైఎస్ ఫ్యామిలీ రెండుగా చీలి పోటీ చేస్తున్న ఎన్నిక కావడంతో... కడపలో ఆమె ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

కడప లోక్ సభ స్థానానికి వైసీపీ నుంచి షర్మిళకు వరుసకు తమ్ముడు అయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టార్గెట్ అవినాష్ అన్నట్లుగా షర్మిళ బరిలోకి దిగుతున్నారని అంటున్నారు. దీంతో ఆమె లోక్ సభ కు పోటీ చేస్తే.. ఆ ప్రభావం ఆ పరిధిలోని 7 నియోజకవర్గాలపైనా పడే అవకాశం ఎంత అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ ప్రభావం పడితే వచ్చే ఫలితాలు ఒకరకమైన సంకేతాలు ఇస్తే... ప్రభావం పడకపోతే వచ్చే ఫలితాలు మరికొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

కడపలో షర్మిళ ఎంపీగా పోటీ చేస్తే... ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కడప, పులిఎందుల, బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశాలున్నాయనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఇక్కడ నిన్నటివరకూ ద్విముఖ పోరుగా ఉన్న పోటీ కాస్తా ఇప్పుడు త్రిముఖ పోరుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక పైన చెప్పుకున్న 7 నియోజకవర్గాల్లోనూ పులివెందులలో షర్మిళ అన్న జగన్ పోటీ చేస్తుండగా.. కమలాపురంలో షర్మిల సొంత మేనమామ రవీంద్రనథ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో... కడప లోక్ సభ స్థానం విషయమలో స్థానిక ప్రజానికం జగన్ ని కాదని షర్మిళను నమ్మితే మాత్రం ఆ ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఇదే సమయంలో... షర్మిళ గెలిచినా, ఓడినా ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని భావించో.. మరో కారణంతోనో షర్మిళను లైట్ తీసుకుంటే మాత్రం.. రెండు రకాల క్లారిటీలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందులో ఒకటి వైఎస్ వివేకా హత్య విషయలో వైసీపీ నాయకులు ఉన్నారనే వాదనను జనాలు పరిగణలోకి తీసుకోలేదని భావించడం.. కాగా... వైఎస్ వారసత్వం విషయంలో కడప ప్రజానికం జగన్ వైపే నిలబడుతున్నారని భావించడం రెండోది అని అంటున్నారు!