వైసీపీ.... కాంగ్రెస్‌లో విలీనం అవుతోందా?!
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల.. గత ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 29 Jun 2025 12:04 PM ISTకాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల.. గత ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. వివేకా హత్య కేసు నుంచి తన ఆస్తుల వ్యవహారాల వరకు షర్మిల అనేక విషయాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయితే.. తాజాగా షర్మిల యూటర్న్ తీసుకుని.. మరో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. వరుస నాలుగు రోజులుగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. నేరుగానే వైసీపీని టార్గెట్ చేస్తున్న షర్మిల.. కాంగ్రెస్‌ను మహా సముద్రంతో పోల్చుతున్నారు.
మహాసముద్రం వంటి కాంగ్రెస్‌లో పిల్లకాలువలు కలిసిపోతాయని షర్మిల చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ పేరును కూడా ఆమె చెబుతున్నారు. ``కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. దేశంలో ఉన్న అన్ని పిల్లకాలువలు.. సముద్రంలో కలిసిపోవాల్సిందే. వైసీపీ కూడా ఏదో ఒక రోజు ఇదే పనిచేస్తుంది.`` అని షర్మిల వ్యాఖ్యానిస్తున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న షర్మిల జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీని పిల్లకాలువతో పోల్చిన ఆమె.. సముద్రంలో కలిసిపోతుందన్నారు.
వాస్తవానికి గత ఏడాది ఎన్నికల తర్వాత.. కూడా ఈ తరహా చర్చ అయితే వచ్చింది. పార్టీ ఘోరంగా ఓడిపోయిన దరిమిలా.. జగన్ పరిస్థితి ఇబ్బందిగా మారిందన్న చర్చ తెరమీదికి వచ్చింది. బీజేపీతో గత ఐదేళ్లు కలిసి ఉన్న జగన్ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో కూటమితో కలిసి బీజేపీ అధికారం పంచుకుంది. ఈ పరిణామాలతో జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు తిరగదోడడం ఖాయమని చర్చ వచ్చింది. ఇదే జరిగితే.. రాజకీయంగా తనకు రక్షణ అవసరమని జగన్ భావించా రు. దీంతో ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో చేరుతారన్న చర్చ జరిగింది.
తద్వారా తనను తాను కేసుల నుంచి రక్షించుకుంటారని కూడా విశ్లేషకులు కొందరు చెప్పు కొచ్చారు. అయితే.. ఇప్పటి వరకు అలాంటి పరిణామాలేవీ జరగలేదు. పైగా.. వైసీపీ వాదన కూడా మరోలా వుంది. బీజేపీకి-కాంగ్రెస్‌కు మధ్య తీవ్ర ఘర్షణ ఉందని.. అలాంటి సమయంలో జగన్ పోయి పోయి కాంగ్రెస్ కూటమిలో చేరితే.. లేనిపోని ఇబ్బందులు వస్తాయన్నది వైసీపీ వాదన. ఈ క్రమంలో తటస్థంగా ఉంటేనే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆతరహా సంకేతాలు అయితే.. వైసీపీ నుంచి రాలేదు. కానీ, తాజాగా మరోసారి షర్మిల చేస్తున్న వ్యాఖ్యలతో ఏం జరుగుతుందన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.
