ఢిల్లీలో అడగాల్సిన మాటలు గల్లీలో ఎందుకు షర్మిలా..?
దీంతో ప్రధాని రాకను పురస్కరించుకుని.. రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేస్తోంది. అయితే.. ప్రధాని మోడీని తాజాగా షర్మిల కడిగి పారేశారు.
By: Tupaki Desk | 19 April 2025 11:18 AM ISTఢిల్లీలో అడగాల్సిన మాటలను గల్లీలో అడిగితే ఎలా ఉంటుంది? అందరూ నవ్విపోతారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల చేస్తున్నారు. ఢిల్లీని ప్రశ్నించాల్సిన ఆమె.. గల్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఇదే పెద్ద రాజకీయం అంటూ.. స్వీయ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో షర్మిల వ్యవహారంపై సొంత పార్టీ నాయకులే నవ్వుతున్నారు. త్వరలోనే ప్రధాని మోడీ ఏపికి వస్తున్నారు. అమరావతి రాజధాని పనులను రెండో విడత ఆయన ప్రారంభించనున్నారు.
దీంతో ప్రధాని రాకను పురస్కరించుకుని.. రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేస్తోంది. అయితే.. ప్రధాని మోడీని తాజాగా షర్మిల కడిగి పారేశారు. అమరావతిని గత 9 సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదన్నారు. వాస్తవానికి గత ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉంది. రాజధానిని కాదని.. మూడు రాజధానుల పేరుతో ప్రత్యేక అజెండా ఏర్పాటు చేసుకుంది. అప్పట్లో అడగడం మానేసిన షర్మిల.. ఇప్పుడు మోడీపై తప్పు ఎత్తి చూపుతున్నారు. రాజధానిని నిర్మించుకుంటామంటే.. మోడీ అడ్డు పడలేదు. వద్దంటే కాదనలేదు.
అయినా.. ఇప్పుడు మోడీని షర్మిల నిలదీస్తున్నారు. ఇక, పోలవరం ఎత్తు విషయాన్ని కూడా ఆమె యాగీ చేస్తున్నారు. ఎత్తును 45.9 మీటర్ల నుంచి 41.6 మీటర్లకు తగ్గించడంపై ప్రశ్నించారు. కానీ, వాస్తవానికి, ఈ ఎత్తు తగ్గించింది ఎవరు అంటూ.. మళ్లీ అన్ని వేళ్లూ వైసీపీ వైపు చూపిస్తున్నాయి. ఇది జరిగింది వైసీపీ హయాంలోనే అని అందరూ చెబుతున్నారు. కేంద్రం కూడా ఇదే చెబుతోంది. కానీ, ఆనాడు అన్నను ప్రశ్నించలేదు. ఇప్పుడు నిర్మాణం ప్రారంభించేసరికి.. మాత్రం ఢిల్లీని షర్మిల ప్రశ్నిస్తున్నారు.
కేవలం ఈ రెండు విషయాలే కాదు.. విశాఖ ఉక్కు పరిశ్రమపై కూడా.. షర్మిల నిలదీశారు. అయితే.. ఇవ న్నీ.. కేంద్రాన్నికాదు.. అడగాల్సింది.. రాష్ట్రంలో గత వైసీపీ సర్కారు చేసిన నిర్వాకం కారణంగానే తప్పు లు జరిగాయని కేంద్రం చెబుతున్నప్పుడు.. ఆ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్న ప్రశ్న ఉంది. సో.. ఏదేమైనా.. షర్మిల నిజాయితీగా రాష్ట్రానికి ఏదైనా చేయాలని అనుకుంటే.. ప్రజల మధ్యకు రావాలి. ప్రజల తరఫున కేంద్రాన్ని నిలదీయాలి. అంతేకానీ.. ఇంట్లో కూర్చుని గల్లి రాజకీయాలు చేస్తే.. ప్రయోజనం ఏంటన్నది ప్రశ్న.
