జగన్ టూర్ల సీక్రెట్ చెప్పిన చెల్లెమ్మ
జగన్ పర్యటనలు పేరుతో చేస్తున్నది ఏంటి అంటే బెట్టింగులు కాసి ఆత్మహత్యలు చేసుకున్న వారి విగ్రహాలను సైతం ఆవిష్కరించేందుకు వెళ్తున్నారని ఆమె కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 23 Jun 2025 10:42 PM ISTఅన్న గుట్టు చెల్లెలుకే బాగా తెలుసు అంటారు. అచ్చంగా అదే నిజమని ఒట్టేసి చెబుతున్నారు జగనన్న సొంత చెల్లెలు షర్మిలమ్మ. జగన్ ఈ మధ్య జనంలోకి ఎందుకు వస్తున్నారో ఆమె సీక్రెట్ చెప్పారు. జగన్ కి జనాల మీద ప్రేమ కాదని తేల్చేశారు. అంతే కాదు తన సొంత పార్టీ కార్యకర్తల మీద అలవిమాలిన అభిమానం అంతకంటే కాదని కూడా స్పష్టం చేశారు.
మరి జగన్ ఎందుకు టూర్లు చేస్తున్నారు అంటే అక్కడే ఉంది అసలు రహస్యం అంటున్నారు. జగన్ జనంలోకి రావడం అంటే తన బలాన్ని చూపించుకోవడం కోసమని పీసీసీ చీఫ్ షర్మిల చెబుతున్నారు. తనకు జనాలను చూపిస్తూ జగన్ బల ప్రదర్శన చేస్తున్నారు అని ఆమె ఎకసెక్కం చేశారు. అంతే కాదు జగన్ తనకు అధికారం పోయినా జనాలు వెంట ఉన్నారని అందరికీ చూపించేదుకే ఈ పర్యటనలు చేస్తున్నారు అని అంటున్నారు.
ఇక ఆయన తనకు ధనబలం ఉందని జనాలను సమీకరించి మరీ బల ప్రదర్శన చేయగలను అని నిరూపించడానికి కూడా ఈ పర్యటనలు చేస్తున్నారు అని ఆమె సెటైర్లు వేశారు. ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అయిదేళ్ల పాటు తన ఇంటి గుమ్మం కదలకుండా కుంభకర్ణుడు మాదిరిగా నిద్ర పోయారు అని షర్మిల నిష్టూర మాడారు
ఆనాడు జగన్ కి ప్రజలు కానీ సొంత పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడా కనిపించలేదని ఆమె విమర్శించారు. అయితే ఎన్నికలు ఆరు నెలలలో ఉన్నాయనగా సిద్ధం సభలు పెట్టి హడావుడి చేశారు అని గుర్తు చేశారు ఇపుడు మాత్రం ప్రజలు కార్యకర్తలు అంటూ పర్యటనలు చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.
జగన్ పర్యటనలు పేరుతో చేస్తున్నది ఏంటి అంటే బెట్టింగులు కాసి ఆత్మహత్యలు చేసుకున్న వారి విగ్రహాలను సైతం ఆవిష్కరించేందుకు వెళ్తున్నారని ఆమె కామెంట్స్ చేశారు. ఇందులో ప్రజా సమస్యల మీద పోరాటం ఎక్కడా లేదని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉంటే జగన్ మాత్రం బల ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తప్పు పట్టారు.
నిజానికి జగన్ వేలాది మందిని పోగు చేసి ఈ రకంగా చేయడమేంటని ఆమె ఫైర్ అయ్యారు. మొత్తానికి చూస్తే అన్నయ్య టూర్ల వెనక సీక్రెట్ ఏంటో షర్మిల చెప్పేశారు. ఆయనకు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఎక్కడా లేదని నిందించారు. మొత్తానికి షర్మిల మాత్రం అన్న జగన్ ని నిత్యం వెంటాడుతూనే ఉన్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక రూపంలో ఆయన మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరి వైసీపీ అయితే వీటికి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాల్సి ఉంది.
