షర్మిలకు 'ఛాన్స్'.. సక్సెస్ అయ్యేనా ..!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ సోదరిగా రాజకీయాలు చేస్తున్న షర్మిలకు రాజకీయంగా ఆవేశం తీర్చుకునే అవకాశం వచ్చింది
By: Tupaki Desk | 20 Jun 2025 8:00 AM ISTకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ సోదరిగా రాజకీయాలు చేస్తున్న షర్మిలకు రాజకీయంగా ఆవేశం తీర్చుకునే అవకాశం వచ్చింది. జగన్ పై మరింతగా రెచ్చిపోయే అవకాశం లభించింది. తన ఫోన్ను గతంలో టాప్ చేశారని తన మాటలను తనకే వినిపించారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఇది జరిగింది ఏపీలో కాదు తెలంగాణలో. కానీ ఏపీలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆమెను టార్గెట్ చేసి ఫోన్ టాపింగుకు పాల్పడేలాగా సొంత అన్నయ్య ప్రోత్సహించాడు అనేది ఆమె చేస్తున్న ఆరోపణ.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమెకు మరో బలమైన రాజకీయ కారణం లభించింది అని చెప్పాలి. వాస్తవానికి ఫోన్ టాపింగ్ అనేది ప్రస్తుతం ఉన్న చట్టాలు ప్రకారం కీలకమైన కేసు. కానీ ఏపీలో ఆమెకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ దే అయినా నడిపిస్తున్నది మాత్రం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి షర్మిలకు మధ్య రాజకీయంగా పరస్పర విభేదాలు అవగాహన లోపాలు చాలానే ఉన్నాయి. ఇన్నాళ్ళు అయినా రేవంత్ రెడ్డి ఏనాడు షర్మిల గురించి గానీ షర్మిల రాజకీయాల గురించి గానీ ఎక్కడా ప్రస్తావించలేదు.
కేవలం గత ఎన్నికల సమయంలో విశాఖపట్నం వచ్చిన సందర్భంలో మాత్రమే ఆయన ప్రచారం చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కీలకమైన ఈ కేసును షర్మిలకు అనుకూలంగా లేదా ఆమె వాదనను బట్టి పరిగణలోకి తీసుకుని ఏ మేరకు ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి. కానీ షర్మిలకు మాత్రం ఒక బలమైన అవకాశాన్ని అవసరాన్ని ఈ కేసు కల్పించింది అనేది పరిశీలకులు చెబుతున్న మాట. గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసును తనకు అనుకూలంగా మార్చుకున్న షర్మిల ఆ తర్వాత ఆస్తులు విషయాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చారు. ఈ రెండు విఫల ప్రయోగంగానే మారిపోయాయి.
ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో షర్మిల పోటీ చేసిన కడపలో మూడో స్థానానికి ఆమె పరిమితం అయ్యారు. కొందరు డిపాజిట్లు కూడా దక్కలేదని అంటారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమీ పుంజుకోలేదు. ఇప్పుడు ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డారంటూ ఆమె ఆవేదన చెందడం సొంత అన్న తనను ఇరుకున పెట్టేలాగా తనను ఏకాకిని చేసేలాగా ఆర్థికంగా అణిచేలాగా చేశారని చెప్పడం ద్వారా మరోసారి ఇదే తరహా ఆవేశాన్ని సెంటిమెంట్ను ప్రజల్లో కల్పించాలని షర్మిల వ్యూహంగా కనిపిస్తోంది.
అయితే దీనికి ఏపీ ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే కేసు ఏదైనా జరిగి ఉంటే అది తెలంగాణలో జరిగింది. తెలంగాణలోని గత ప్రభుత్వం చేసింది. ఏపీలో వైసిపి నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఈ కేస్ కు సంబంధం లేదు. దీంతో షర్మిల ఏమైనా పోరాటం చేయాల్సి ఉంటే అది తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ రాజకీయంగా మాత్రం ఆమె వాదన వినిపించేందుకు తన ఆవేశాన్ని ప్రదర్శించేందుకు తన అన్నపై మరోసారి విమర్శలు చేసేందుకు ఈ కేసు ఉపయోగపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. దీనిపై జగన్ ఎలా స్పందిస్తారు పైగా ఈ కేసులో సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని కూడా ఆమె పేర్కొనడం ఆయన మౌనంగా ఉండడం వంటివి కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఏదేమైనా షర్మిలకు ఒక రాజకీయ అవకాశం అయితే మళ్లీ చిక్కింది. దీనిని ఏ మేరకు వాడుకుంటారు అనేది చూడాలి.
